ఇది చిరు ‘లూసిఫర్’

ఆ మలయాళం వాళ్లకేమీ..వాళ్లేమైనా తీస్తారు. వాళ్ల జ‌నాలే కాదు. మన జ‌నాలు కూడా చూస్తారు. శహభాష్ అనేస్తారు. కానీ మన సీనియర్ హీరోలు, మాస్ కా బాస్ అనుకునేవాళ్లు ఆ సినిమా తెలుగులోకి తీయాలంటే…

ఆ మలయాళం వాళ్లకేమీ..వాళ్లేమైనా తీస్తారు. వాళ్ల జ‌నాలే కాదు. మన జ‌నాలు కూడా చూస్తారు. శహభాష్ అనేస్తారు. కానీ మన సీనియర్ హీరోలు, మాస్ కా బాస్ అనుకునేవాళ్లు ఆ సినిమా తెలుగులోకి తీయాలంటే ఒక బాధ కాదు. ఒక సమస్య కాదు. వాళ్లు అనుకునే, అనేసుకునే మనవాళ్ల మైండ్ సెట్ కు అనుగుణంగా కథను మార్చాలి. కమర్షియాలిటీ కూర్చాలి. మాస్..ఫ్యాన్స్ ఫీస్ట్ అంటూ ఫీట్లు యాడ్ చేయాలి. అలా అని మళ్లీ ఒరిజినాలిటీ చెడకూడదు.

ఇన్ని చూసుకున్న తరువాతే ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ రెడీ అవుతోంది అని క్లారిటీ వచ్చేసింది. ఈ రోజు విడుదలయిన టీజ‌ర్ ఈ విషయం స్పష్టం చేసింది. నయనతార, సత్య, సముద్రఖని క్యారెక్టర్లు అలాగే వున్నాయి. నయనతార పక్కన మరో హీరోయిన్ లాంటి అమ్మాయి చేరింది. అంటే కూతురు క్యారెక్టర్ మరో విధంగా మార్చారేమో అని చిన్న అనుమానం.

ప్రధానమైన మోహన్ లాల్ క్యారెక్టర్ మెగాస్టార్ మోడ్ లోకి మారింది. మెగాస్టార్ హావభావాలు బాగానే వున్నాయి. కానీ లూసిఫర్ లో అంతగా కనిపించని యాక్షన్ సీన్లు వచ్చి చేరినట్లున్నాయి. ముఖ్యంగా సల్లూ భాయ్ కోసం అదనపు సీన్లు రాసుకున్నట్లున్నారు. అంతా బాగానే వుంది కానీ టీజ‌ర్ చివర్న సల్లూ భాయ్..మెగాస్టార్ కలిసి జీప్ లో వచ్చిన సీన్ చూస్తుంటే మాత్రం అదేదో సినిమాలో రావు రమేష్ రాసిన ‘అబ్బే వీళ్లు మారర్రా’ అనే డైలాగు గుర్తుకువచ్చింది.

ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ సినిమా దసరా కానుకగా థియేటర్లలోకి రాబొతోంది. మెగా ఫ్యాన్స్ కోసం దర్శకుడు మోహన్ రాజా మరెన్ని చమక్కులు చేసారో ట్రయిలర్ కోసం వేచి వుంటే తెలుస్తుంది.