బాకీ తీర్చేసుకుంటున్న జ‌క్కన్న?

ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ. ఈ రోజు అంతా ఇదే వార్త..ఇదే హడావుడి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటన చూసేసి కేంద్ర మంత్రి అమిత్ షా ఫిదా అయిపోయి, అర్ఙంట్ గా హైదరాబాద్…

ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ. ఈ రోజు అంతా ఇదే వార్త..ఇదే హడావుడి. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటన చూసేసి కేంద్ర మంత్రి అమిత్ షా ఫిదా అయిపోయి, అర్ఙంట్ గా హైదరాబాద్ లో ఆంతరంగికంగా సమావేశమైపోయి శహభాష్ అనబోతున్నారని వార్త. 

ఇంకేం వుంది. ఇండియా నుంచి ఆస్కార్ ఎంట్రీల్లో ఎన్టీఆర్ పేరు వుంటుందని, తెలంగాణలో ఎన్టీఆర్ మద్దుతు భాజ‌పాకు వుంటుందని, ఇలా చాలా అంటే చాలా ఊహాగానాలు. కానీ విశ్వసనీయ వర్గాల కథనం వేరుగా వుంది.

ఆర్ఆర్ఆర్ విడుదల తరువాత ఎన్టీఆర్ చాలా దిగాలు పడ్డారని, అంతకన్నా ఎక్కువగా రాజ‌మౌళి పట్ల ఆగ్రహంతొ వున్నారని వార్తలు వినవచ్చాయి. తన పాత్ర దాన్ని మలిచిన తీరుతెన్నుల పట్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ కూడా చాలా బాధపడ్డారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే వున్నాయి. మరోపక్కన చరణ్ ఫ్యాన్స్ ఓ లెవెల్ లో ఆనందపడ్డారు. పడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో అన్ని విధాల పనికి వచ్చే ప్రణాళికను విజ‌యేంద్ర ప్రసాద్ రచించారని, దాని పర్యవసానమే ఇప్పుడు ఎన్టీఆర్-అమిత్ షా ల కలయిక అని తెలుస్తోంది. తెలంగాణలో మునుగోడు ఎన్నిక నేపథ్యంలో ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు కమ్మ సామాజిక వర్గం అంతా భాజ‌పాకు ఇంతో అంతో మద్దతు ఇచ్చేందుకు ఈ మీటింగ్ దోహదం చేస్తుందనే ఉపాయం దీని వెనుక వుందని, ఈ ప్లానింగ్ అంతా విజ‌యేంద్ర ప్రసాద్ దే అని వినిపిస్తోంది.

ఆ విధంగా ఎన్టీఆర్ శాంతించి రాజ‌మౌళికి దగ్గర కావచ్చు. ఎందుకంటే ఇవ్వాళ కాకుంటే తరువాతైనా ఎన్టీఆర్ రాజ‌మౌళికి కావాలి. మల్టీ స్టారర్ చేసినా, సోలో సినిమా చేసినా ఆ అవసరం వుంది. వుంటుంది. ఆంధ్రలో పవన్ తోడు వున్నంత రేంజ్ లో కాకున్నా, ఎన్టీఆర్ అండ వుంది అనే కలరింగ్ చాలు భాజ‌పాకు. అయితే ఎన్టీఆర్ చాలా తెలివైన వాడు. 

ఒకందుకు పోస్తే మరొకందుకు తీసుకునే రకం. మాంచి ఆఫ్ లైన్ నటుడు కూడా. అంత సులువుగా బయటపడే వ్యక్తి కాదు.అలా అని చెప్పి దీని వల్ల తేదేపాకు ఒరిగేది, ఒరగబెట్టేది కూడా వుండదు. అందరూ అనుకున్నట్లు పవన్ మాదిరిగా లోకేష్ పల్లకీ మోయడానికి ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్దంగా వుండడు.

ఈ రోజు రేపు మీడియాకు వార్తలు, ఫొటోలు, ఊహాగానాల హాడావుడి తప్ప అంతకు మించి వుండదని మాత్రం పక్కాగా చెప్పుకోవచ్చు.