జనసేనాని పవన్‌కల్యాణ్ తన రాజకీయ స్వార్థానికి రాయలసీమ ప్రాంతానికి కుల విష సంస్కృతిని తీసుకొస్తున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. రాజంపేట నియోజకవర్గంలోని సిద్ధవటంలో పవన్‌కల్యాణ్ కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమలో కులపరంగా ఎలాంటి వివక్ష ఉండదని ఆ ప్రాంత సమాజం గుర్తు చేస్తోంది.
రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ బలంగా వుండేదని, ఇప్పుడు అది కూడా పూర్తిగా పోయిందని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. రాయలసీమవాసులు కూడా బాగా చదువుకుంటున్నారని, దేశవిదేశాల్లో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారని గుర్తు చేస్తున్నారు. రాయలసీమలో ప్రధానంగా రెడ్లు, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు, బలిజలు, దళితులు తదితర కులాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కులాలు వేరైనా పరస్పరం వరుసలు పెట్టి పిలుచుకునే గొప్ప సంస్కృతి వుందని రాయలసీమ వాసులు అంటున్నారు. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడులో , అలాగే 1991లో గుంటూరు జిల్లా చుండూరులో ఆధిపత్య కులాలు దళితులను ఊచకోత కోసిన ఉదంతాలు రాయలసీమలో మచ్చుకైనా లేవని ఆ ప్రాంత మేధావులు, విద్యావంతులు గుర్తు చేస్తున్నారు.
అలాగే విజయవాడలో వంగవీటి రంగా, దేవినేని నెహ్రూ కుటుంబాల మధ్య వార్… చివరికి రెండు కులాల మధ్య వైరంగా మారిన సంగతిని సీమ సమాజం పవన్‌కు తెలియజెబుతోంది. అలాగే ఒక సామాజిక వర్గం రిజర్వేషన్ కోసం తునిలోనూ, కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ అమలాపురంలో చోటు చేసుకున్న విధ్వంసాల వెనుక ప్రధానంగా కులమే రాజ్యమేలిన విషయాన్ని సీమ సమాజం ప్రత్యేకంగా చైతన్యపరుస్తోంది.
ఇక సినిమా హీరోల అభిమానుల విషయంలోనూ కులాల పరంగా చీలిపోయిన సంగతి అందరికంటే పవన్‌కల్యాణ్‌కే బాగా తెలుసని అంటున్నారు. ప్రభాస్, మెగా హీరోల అభిమానులు ఏఏ కులాలకు చెందిన వాళ్లో ప్రత్యేకంగా పవన్‌కల్యాణ్‌కు చెప్పాలా? అని సీమ సమాజం ప్రశ్నిస్తోంది. కావున కులపరమైన విద్వేష బీజాలను దయచేసి రాయలసీమలో నాటేందుకు ప్రయత్నించొద్దని సీమ మేధావులు, ప్రజాసంఘాల నేతలు పవన్‌ను వినయపూర్వకంగా వేడుకుంటున్నారు.
కులాల ప్రస్తావన లేకుండా రాయలసీమలో రాజకీయం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కుల రాజకీయాలను తాను పుట్టిపెరిగిన ప్రాంతంలో చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని విన్నవించుకోవడం విశేషం. వీటిని పవన్‌కల్యాణ్ ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారో చూద్దాం.