టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్స్ విసిరారు. మహానాడును కామెడీ షోగా అభివర్ణించారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అది మహానాడు కాదు.. మోసపునాడని ఘాటు విమర్శ చేశారు. వంద మహానాడులు చేసినా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాలేడని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లు కూడా చంద్రబాబుకు నిద్రపట్టదన్నారు. చంద్రబాబు తప్పిదం వల్లే డయాఫ్రమ్ వాల్ కూలిపోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకంగా మహానాడు జరుగుతోందన్నారు.
మహానాడును అప్పుడప్పుడూ చూస్తూ వున్నానని, చాలా కామెడీగా సాగుతోందన్నారు. చాలా మంది కామెడీ వాళ్లు కూడా వస్తున్నారని చమత్కరించారు. ఒకావిడ తొడ కొడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలను బస్సులో నుంచి ఈడ్చి తంతానంటోం దన్నారు. ఆవిడకు నెల్లూరు నుంచి వచ్చిన మరో నాయకుడు తోడయ్యారన్నారు. నెల్లూరాయన పేరేదో గుర్తు లేదన్నాడు.
తమిళసినిమాలో వడివేలు వుంటాడే… ఆ రకంగా ఉన్నట్టు అంబటి చెప్పుకొచ్చారు. స్టేజీ మీదకి రాగానే శోకాలు పెడుతున్నాడని వెటకరించారు. రోజమ్మా, షర్మిలమ్మా అని శోకాలు పెడుతున్నాడని విమర్శించారు. కుటుంబాన్నే మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా? అని వడివేలు లాంటి నాయకుడు ప్రశ్నించారని గుర్తు చేశారు. కుటుంబాన్ని మోసం చేసిన నాయకుడు ఆయన వెనుకే ఉన్నాడని చంద్రబాబును పరోక్షంగా గుర్తు చేశారు.
మామను వెన్నుపోటు పొడిచాడని, బామ్మర్దిని బయటికి నెట్టాడని, తమ్మున్ని తన్ని తరిమేశాడని, తోడల్లుని తోక కత్తెరించాడని, అలాగే జూనియర్ ఎన్టీఆర్‌ని వాడుకుని వదిలేశాడని అంబటి విరుచుకుపడ్డారు. ఇన్ని రకాలుగా కుటుంబాన్ని మోసగించిన వ్యక్తిని ముందు పెట్టుకుని …వడివేలు లాంటి నెల్లూరాయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం ఏంటని నిలదీశారు.
వడివేలు లాంటి ఆ నాయకుని మాటలతో చంద్రబాబు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దెప్పి పొడిచారు. నెల్లూరుకు చెందిన ఆనం వెంకటరమణారెడ్డిని తమిళ కమెడియన్ వడివేలుతో అంబటి పోల్చడం గమనార్హం. కానీ ఎక్కడా అనం పేరు ప్రస్తావించకుండా సెటైర్స్‌తో తన మార్క్ విమర్శలు చేయడం గమనార్హం.