త‌గ్గ‌నంటున్న క‌రోనా కేసులు.. మూడో వేవ్ మొద‌లైందా?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య అనుకున్నంత స్థాయిలో త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. పరిశోధ‌కుల అంచ‌నా ప్ర‌కారం జూన్ చివ‌రి వారంతోనే క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టాల్సింది. జూన్ చివ‌రి వ‌ర‌కూ బాగానే…

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య అనుకున్నంత స్థాయిలో త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు. పరిశోధ‌కుల అంచ‌నా ప్ర‌కారం జూన్ చివ‌రి వారంతోనే క‌రోనా సెకెండ్ వేవ్ పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టాల్సింది. జూన్ చివ‌రి వ‌ర‌కూ బాగానే త‌గ్గిన కేసుల సంఖ్య పూర్తి స్థాయిలో మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌త్యేకించి జూలై తొలి ప‌ది రోజుల్లో రోజువారీ కేసుల నంబ‌ర్ స్ట‌డీగా కొన‌సాగుతున్నాయి. 

గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే ఈ వారంలో కేర‌ళ‌లో యాక్టివ్ కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగింది! కేర‌ళ‌లో ఇంత‌కు ముందు వారంలో స్థూలంగా 60 వేల కేసులు న‌మోదు కాగా, ఈ వారంలో అక్క‌డ ఏకంగా 64 వేల కేసులు న‌మోద‌య్యాయి.

వారం రోజుల వ్య‌వ‌ధిలో మొత్తం నాలుగు వేల కేసులు అద‌నంగా న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అంత‌కు ముందు వారంతో పోలిస్తే త‌గ్గాల్సిన కేసుల సంఖ్య‌, ఈ వారంలో పెరిగింది. సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతోంద‌నుకున్న త‌రుణంలో కూడా రోజువారీ కేసుల సంఖ్య‌లో కాస్త పెరుగుద‌ల చోటు చేసుకోవ‌డం ఆందోళ‌న‌క‌రంగా మారుతోంది.

ఇక మ‌హారాష్ట్ర‌లో త‌గ్గుద‌ల లేదు, పెరుగుద‌లా లేదు. య‌థారీతిన కొన‌సాగుతోంది అక్క‌డ ప‌రిస్థితి. అయితే భారీ కేసుల‌ను న‌మోదు చేసిన క‌ర్ణాట‌క‌లో మాత్రం త‌గ్గుద‌ల కొన‌సాగుతూ ఉంది. క‌రోనా కేసులు భారీగా న‌మోదైన మ‌రో రాష్ట్రం త‌మిళ‌నాడులో కూడా ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య బాగా త‌గ్గింది. మ‌ణిపుర్, మేఘాల‌య‌, త్రిపుర‌, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా గ‌త వారం రోజుల్లో ఇన్ఫెక్ష‌న్ రేటు కాస్త పెరిగిన‌ట్టుగా తెలుస్తోంది.

ఏతావాతా ఇదీ ప‌రిస్థితి. దేశంలో చాలా రాష్ట్రాల్లో కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా..కొన్ని రాష్ట్రాల్లో మాత్రం గ‌త వారంలో మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. ఇది ప్ర‌జ‌ల్లో నిర్ల‌క్ష్యం పెర‌గ‌డం వ‌ల్ల‌నే అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కేసులు పీక్ స్టేజ్ లో ఉన్న‌ప్పుడే త‌మ‌కు క‌రోనా సోక‌లేదు అనే ధైర్యంతో కొంద‌రు ఇప్పుడు ధైర్యంగా తిరుగుతున్నారు.

అప్పుడే మాస్కులు గ‌ట్రా ప‌క్క‌న పెట్టేసిన వాళ్లూ చాలా మంది క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు క‌రోనా కేసుల్లో మ‌ళ్లీ పెరుగుద‌ల న‌మోద‌వుతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. క‌రోనా త‌దుపరి వేవ్ రావ‌డానికి ఏం అక్క‌ర్లేదు.. జ‌నాలు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను మానేస్తే చాల‌ని నిపుణులు అంటున్నారు. దాని వ‌ల్ల‌నే ఇప్పుడు మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ పెరుగుద‌ల‌తో మూడో వేవ్ మొద‌ల‌యిన‌ట్టేనా అనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.