టీడీపీ నుంచి మాజీ మంత్రి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా అఖిలప్రియను గెంటేసేందుకు రంగం సిద్ధం అవుతోందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ సందర్భంగా పార్టీలో అఖిలప్రియకు ఎదురవుతున్న అవమానాలను భూమా అభిమానులు గుర్తు చేస్తున్నారు.
చివరికి ప్రెస్‌మీట్ పెట్టుకోడానికి కూడా కర్నూలులో పార్టీ కార్యాలయంలోకి అనుమతించక పోవడాన్ని భూమా అనుచరులు, టీడీపీ శ్రేణులు ప్రస్తావిస్తుండడం గమనార్హం. అలాగే ఓ పథకం ప్రకారం టీడీపీ అధిష్టానం అఖిల ప్రియపై సొంత మీడియాతో దాడి చేయిస్తుండడం వెనుక పెద్ద కుట్ర జరుగుతోందనే అనుమానాలు అఖిలప్రియలో కూడా ఉన్నాయంటున్నారు.
తల్లి శోభానాగిరెడ్డి ఆకస్మిక మృతితో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రోత్సాహంతో ఆమె ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి ఆమె కూడా టీడీపీలో చేరారు. ఆ తర్వాత కొంత కాలానికి భూమా నాగిరెడ్డి హఠాన్మరణం, ఆ కుటుంబానికి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. అలాగే అఖిలప్రియకు పిన్న వయసులోనే మంత్రి పదవి దక్కింది.
గత సార్వత్రిక ఎన్నికల్లో అన్నాచెల్లెల్లిద్దరూ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పాటు మరి కొందరితో భూమా అఖిలప్రియకు ఆస్తిగొడవలు తలెత్తాయి. చివరికి ఆళ్లగడ్డలో క్రషర్ మిషన్ విషయంలో దగ్గరి బంధువుపైనే దాడికి వరకూ వెళ్లడం తీవ్ర సంచలనం కలిగించింది. క్రషర్ మిషన్ మూసివేసే వరకూ అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ శాంతించలేదు. ఆ తర్వాత విజయాడెయిరీ చైర్మన్ పదవిపై అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ కన్ను పడింది.
ఈ నేపథ్యంలో తన చిన్నబ్బ (నాగిరెడ్డి సొంత చిన్నాన్న)ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని భార్గవ్‌రామ్, అఖిల తమ్ముడు జగత్‌విఖ్యాత్‌లపై ఫిర్యాదులు, కేసుల వరకూ దారి తీసింది. ఇవి అందరికీ తెలిసిన సంగతులు. లోకానికి తెలియని గొడవలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. కానీ అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ తీరు వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు ఎప్పటికప్పడు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారని సమాచారం.
కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్ వ్యవహారంపై చంద్రబాబు, లోకేశ్ అసహనంగా ఉన్నారనే వార్తలొచ్చాయి. ఈ కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ జైలుపాలు కూడా అయ్యారు. అప్పుడు అఖిలకు మద్దతుగా టీడీపీ నేతలెవరూ మాటసాయం కూడా చేయలేదనే అభిప్రాయాలున్నాయి. అఖిలప్రియ బెయిల్‌పై విడుదల కావడం, ఆమె భర్త భార్గవ్‌రామ్, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి కూడా హైకోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
అఖిలప్రియపై టీడీపీ అనుకూల పత్రికలు, చానళ్లు పెద్ద ఎత్తున వ్యతిరేక కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం గమనార్హం. మన మీడియాలో మన నాయకురాలి గురించి ఇలాంటి నెగెటివ్ కథనాలేంటి? అనే అనుమానం టీడీపీ శ్రేణులకు కలిగింది. అఖిలప్రియపై ఇటు జగన్, అటు కేసీఆర్ సొంత పత్రికల్లో ఎక్కడా వ్యతిరేక కథనాలు రాకపోవడం గమనార్హం. ఇక్కడే టీడీపీ అధిష్టానం అసలు దురుద్దేశం బయటపడిందనే విమర్శలు భూమా అనుచరుల నుంచి వస్తున్నాయి.
హఫీజ్‌పేట భూముల వ్యవహారంలో ప్రవీణ్‌రావు సోదరుల కిడ్నాప్, తాజాగా కోర్టు విచారణ నుంచి తప్పించుకునేందుకు నకిలీ కోవిడ్ పాజిటివ్ సర్టిఫికెట్ సమర్పణ వరకూ…. టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున అఖిలప్రియకు వ్యతిరేకంగా కథనాలు రావడం వెనుక ఏదో మతలబు ఉందనే అనుమానాలు వారిలో ఉన్నాయి. గతంలో తమ దివంగత నాయకురాలు శోభానాగిరెడ్డికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవిని అడ్డుకోడానికి, సొంత సినిమా థియేటర్లకు సంబంధించి భారీగా విద్యుత్ బకాయిలు చెల్లించలేదని, ఇతరత్రా నెగెటివ్ కథనాలు ఈనాడులో రాసిన విషయాన్ని భూమా అనుచరులు గుర్తు చేస్తున్నారు.
మరోవైపు తనపై మీడియాలో వస్తున్న కథనాలపై స్పందించేందుకు రెండు రోజుల క్రితం అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి కర్నూలు వెళ్లారు. టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు కూడా జిల్లా నాయకత్వం అంగీకరించలేదనే వార్తలొస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకే జిల్లా నాయకత్వం పార్టీ కార్యాలయంలో ఆమె ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదని చెబుతున్నారు. అలాగే జిల్లా కార్యాలయం కాకపోతే ఆమె కర్నూలులో డీవీఆర్ అనే లాడ్జిలో ప్రెస్‌మీట్ నిర్వహించే వారు. రెండు రోజుల క్రితం అక్కడ కూడా సదరు యాజమాన్యం ప్రెస్‌మీట్ పెట్టుకునేందుకు అనుమతించకపోవడాన్ని …అఖిలప్రియకు పడిపోయిన గ్రాఫ్‌ను సూచిస్తోందని చెప్పక తప్పదు.
ప్రజల్లో ఆమెపై వ్యతిరేకత పెంచి, తద్వారా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపడమే ఉత్తమమనే అభిప్రాయాలు కలిగించే కుట్రలో భాగంగానే టీడీపీ అనుకూల మీడియాలో విస్తృత వ్యతిరేక కథనాలు రావడానికి కారణంగా భూమా అనుచరులు భావిస్తున్నారు. మరోవైపు అదే కుటుంబానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని ఆళ్లగడ్డ ఇన్చార్జ్గా నియమించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. మున్ముందు ఏం జరుగుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.