దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల ఎట్టకేలకు పార్టీని అధికారికంగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. పార్టీ లక్ష్యాలను ప్రకటించింది. విధానాలు తెలియజేసింది. అసలు కథ ఇప్పుడే మొదలైంది.
ఇన్నాళ్లు ఒక వ్యక్తిగా ఆమె తన అభిప్రాయాలు చెప్పింది. ఇప్పుడు ఓ పార్టీ అధినేతగా చెప్పాల్సి ఉంటుంది. ఇకనుంచి ఆమె ఏం చెప్పినా అది పార్టీ అభిప్రాయం అవుతుంది. పార్టీ విధానమవుతుంది. కాబట్టి షర్మిల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఆమె పార్టీలో రాజకీయాలను ప్రభావితం చేసే నాయకులు, చరిష్మా ఉన్న నాయకులు ఎవరూ లేరు. ఉన్నవారంతా దాదాపు ఆనాటి వైఎస్ అభిమానులే.
కాబట్టి ఆమె నాయకులను తయారుచేసుకోవాలి. పార్టీ నిర్మాణం చేయాలి. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలి. గతంలో చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం గానీ, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన గానీ పార్టీ నిర్మాణం లేకపోవడంతో దెబ్బతిన్నాయి. షర్మిల పార్టీ తెలంగాణకే పరిమితం కాబట్టి ఆమె పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ముందుగా ఆమె దీన్ని గురించి శ్రద్ధ తీసుకోవాలి.
ఒక కొత్త పార్టీ నిలదొక్కుకోవాలంటే ఒక్కటే సూత్రం. ఇతర పార్టీల నుంచి నాయకులు షర్మిల పార్టీలోకి రావాలి. ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులంతా టీడీపీలో చేరారు. కొందరు టీడీపీతోనే తమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నాయకులుగా ఎదిగి ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు.
టీఆర్ఎస్ పార్టీని చూస్తూనే ఉన్నాం. టీడీపీ మొత్తం ఖాళీ అయింది. కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది గులాబీ పార్టీలో చేరారు. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాంగ్రెస్, టీడీపీ నుంచి నేతలు ఆ పార్టీలో చేరారు. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోనే చెప్పుకోదగ్గ నాయకులు లేరు. ఇతర పార్టీల నుంచి షర్మిల నాయకులను తన పార్టీలోకి ఎలా ఆకర్షిస్తుందన్నదే ప్రధానమైన ప్రశ్న.
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ మొన్నటివరకు డల్ గా ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అద్యక్షుడు కావడంతో పార్టీలో ఉత్సాహం పెరిగింది. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి పోటీ ఇవ్వడం షర్మిలకు అంత సులభం కాదు. ఇతర పార్టీల నాయకులు షర్మిల పార్టీలో చేరడం కూడా కష్టమైన పనే. షర్మిలకు ఇదో పెద్ద సవాల్ అనే చెప్పొచ్చు.
సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేసిన చోట, సోదరి షర్మిల రాజకీయంగా సత్తా చాటుతానంటున్నారు. సాధ్యమేనా.? ఈ ప్రశ్న సర్వత్రా వినిపించడం సహజమే. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైఎస్సార్ అభిమానులు సతమతమవడమూ సహజమే. కానీ, 2014 నాటి భావోద్వేగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వున్నాయా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘సెంటిమెంట్’ ఎప్పుడూ ఒకేలా వుండదు. ఏడేళ్ళయ్యింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.
ఇంకా, ఆనాటి ఆ రాజకీయ నాయకులు వేసిన సెంటిమెంట్ ముద్ర అలాగే వుంటుందని ఎలా అనుకోగలం.? ఏడేళ్ళలో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏం సాధించింది.? అన్న చర్చ ఖచ్చితంగా జరుగుతుంది.
అందులో తెలంగాణ రాష్ట్ర సమితి పాలన తాలూకు వైఫల్యాలు ఖచ్చితంగా వుంటాయి. కానీ అభివృద్ధి జరగలేదని ఎవరూ అనలేరు. అదే సమయంలో పాలనా వైఫల్యాలూ కనిపిస్తాయి. అవే వైఎస్ షర్మిల పెట్టబోయే రాజకీయ పార్టీకి ప్రచారాస్త్రాలన్నది షర్మిల అండ్ టీమ్ భావిస్తుండడం గమనార్హం. కాంగ్రెస్, బీజేపీ పాడుతున్న పాటనే షర్మిల కూడా పాడాలి.