'ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు టికెట్ లు అందుకున్న వారి సగటు వయసు 40…అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థుల సగటు వయసు యాభై పైనే' అంటూ టముకేస్తోంది 'సామాజిక మీడియా'.
నిజమే అందులో సందేహం లేదు. కానీ 2014 లేదా 2019లో చంద్రబాబు నిలబెట్టిన అభ్యర్థుల సగటు వయసు ఎంత? వైకాపా అభ్యర్ధుల సగటు వయసు ఎంత?
ఈ సంగతి గమనించారు కాబట్టే చంద్రబాబు ఈసారి అధికశాతం సీట్లు యువతకే అంటూ నినదిస్తున్నారు. చంద్రబాబు తన తప్పు చాలా ఆలస్యంగా గమనించారు. ఎప్పటికీ అదే టీమ్ ను అలా కొనసాగిస్తుంటే పార్టీలో రెండో తరం ఇక తమకు ఇక్కడ భవిష్యత్ సున్నా అని తెలుసుకుని జారుకున్నారు.
ఇప్పుడు యువతకు సీట్లు అంటున్నారు చంద్రబాబు. కానీ చంద్రబాబు దృష్టిలో యువతరం అంటే పార్టీ ని నమ్ముకున్న రెండో తరం యువనాయకులు కాదు.
అయ్యన్న కుమారుడు, ప్రతిభాభారతి కుమార్తె, అశోక్ కుమార్తె, జెసి బ్రదర్స్ పిల్లలు, పరిటాల కుమారుడు, ఇలా వారసులు మాత్రమే. అంటే మళ్లీ తన తరువాత తన కొడుకుకు పగ్గాలు అన్న మాదిరిగా తన తోటి సీనియర్ల పిల్లలకే మళ్లీ అవకాశాలు ఇవ్వబోతున్నారన్న మాట.
మరి అలా అయితే మళ్లీ పార్టీలో సెకెండ్ జనరేషన్ ఎలా పురుడు పోసుకుంటుంది. ఎందుకు పార్టీని నమ్ముకుని వుంటుంది? సీనియర్లను కాదని చంద్రబాబు ఎందుకు తెగించలేకపోతున్నారు.
జగన్ టికెట్ లు ఇచ్చేటపుడు నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అలా వ్యహరించి ఫలితాలు సాధిస్తున్నారు. కానీ చంద్రబాబు ఆ బాట తొక్కాలనుకుంటారు తప్ప ఆ ధైర్యం మాత్రం చేయలేరు. అందుకే ఆయన దృష్టిలో యువతకు పగ్గాలు అంటే సీనియర్ల వారుసులు మాత్రమే.