ఏపీ ప్రభుత్వం గుడిని, గుడిలోని లింగాన్నీ మింగేసే రకం అంటూ సెటైర్లు పేల్చారు నందమూరి బాలకృష్ణ. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేశారు.
ఓవైపు తన తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వైసీపీ గురించి బాలయ్య ఆ మాట ఎలా అన్నారో అర్థం కావడం లేదు. ఎందుకంటే.. తన తండ్రినీ, తన తండ్రి పెట్టిన పార్టీని రెండింటినీ మింగేసిన చంద్రబాబు గురించి మాట్లాడటం చేతకాని బాలయ్య, వైసీపీని ఎలా విమర్శిస్తారు.
గుడినీ గుడిలో లింగాన్ని మింగింది వైసీపీనా, టీడీపీనా అనేది ఇదివరకే ప్రజలు తేల్చి చెప్పారు. 2024లో కూడా క్లారిటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో బాలయ్యకి తన తండ్రి ఎపిసోడ్ ఎందుకు గుర్తులేదో తెలియడం లేదు.
తన తండ్రి పదవిని, తండ్రి పెట్టిన పార్టీని బాబు లాగేసుకుంటే బాలయ్య ఏం చేస్తున్నారు..? తండ్రి మరణానికి కారణమైన వ్యక్తితోనే బంధుత్వం కలుపుకొని, అతని పంచన చేరిన బాలయ్యని ఏమనాలి?
తప్పు చేసింది ఎవరు బాలయ్యా..?
రుణమాఫీ అనేసరికి చంద్రబాబుని గుడ్డిగా నమ్మి మోసపోయారు ప్రజలు, 2014లో అధికారం కట్టబెట్టి పెద్ద తప్పు చేశారు. ఆ తప్పు తెలుసుకుని 2019లో జగన్ కి పగ్గాలు అప్పగించారు. జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఓవైపు సంక్షేమం, మరోవైపు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ బాలయ్య మాత్రం ప్రజలు ఒక్క ఛాన్స్ అంటూ తప్పు చేశారని అంటున్నారు.
2014లో తప్పు చేసిన ప్రజలు 2019లో ఆ తప్పుని సరిచేసుకున్నారు. అప్పటికీ ప్రజలు చేసింది తప్పు అనుకుంటే మాత్రం… టీడీపీకి 23 సీట్లు ఇవ్వడమే ఆ తప్పు అనుకోవాలి. ఇప్పడు ఎలాగూ తప్పు సరిచేసుకోండి అంటూ బాలకృష్ణ సలహా ఇస్తున్నారు కాబట్టి.. ఈసారి ఆ మాత్రం సీట్లు కూడా టీడీపీకి రావు. పొరపాటున గెలిచిన బాలయ్య కూడా వచ్చే దఫా పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యే అవకాశముంది.
ఓవైపు ఇంత జరుగుతుంటే, తెలుగుదేశం పార్టీని, పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ని మింగేసిన చంద్రబాబు మాత్రం బాలయ్యకి దేవుడిలా కనపడటం విడ్డూరం.