ఒకానొక కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ఎంత వైభవంగా బతికాయి? తాము కమ్యూనిస్టులమని చెప్పుకోవడానికి యూత్ గర్వపడేవారు. పార్లమెంటులోనూ, అసెంబ్లీలోనూ వామపక్ష సభ్యులు అత్యధికంగా ఉండేవారు. ఒకప్పుడు వామపక్షాల వెంట ప్రజలు నడిచారు. కానీ ఇప్పుడు ఆ పార్టీలే ఇతర పార్టీల (తాము బూర్జువా పార్టీలంటూ పిలిచే పార్టీలు) వెంట నడుస్తున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే సీట్ల కోసం అడుక్కుంటున్నాయి. తమ వైభవం అంతరించిందని, తమకు బలం తగ్గిపోయిందని ఆ పార్టీలే ఒప్పుకుంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలా? వద్దా? అని ఎర్ర పార్టీలు తర్జనభర్జన పడ్డాయి. చివరకు పోటీ చేయకపోవడమే మంచిదని, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలో దేనికో ఒకదానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా ఎర్ర పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేశాయి. చివరకు గులాబీ పార్టీకి మద్దతు ఇవ్వాలని సీపీఐ నిర్ణయించింది. సీపీఎం కూడా అదే బాటలో నడుస్తుందని అంటున్నారు.
ఇక ప్రగతిశీల రాజకీయాలకు సీఎం కేసీఆర్ కంకణబద్దుడై ఉన్నారని, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తోందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా తెరపైకి వచ్చిందని, తన స్వార్థ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా బీజేపీని ఓడించేందుకు బలమున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
ఇప్పటి పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కి చాలా బలహీనతలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ పార్టీ గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ కూడా అన్ని హామీలను నెరవేర్చలేదని, కానీ, నెరవేరుస్తారని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాజకీయాలు వేరు, ఎన్నికల ఎత్తుగడలు వేరని చెప్పారు.
సీపీఐ దృష్టిలో టీఆర్ఎస్ ప్రగతిశీల పార్టీ. కాంగ్రెస్ కాదు. టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ లెక్కలు వేరే ఉన్నాయోమో. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా గులాబీ పార్టీకి మద్దతు ఇస్తుందేమో. మునుగోడు 1967లో నియోజకవర్గంగా ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విజయ ఢంకా మోగించారు. అప్పటికే ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది.
ఇప్పటివరకు అక్కడ 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే… ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సీపీఐ, ఒక్కసారి టీఆర్ఎస్ విజయం సాధించాయి. మొత్తంగా చూస్తే.. కాంగ్రెస్, సీపీఐ పార్టీలే ప్రధానంగా పోటీపడ్డాయని చెప్పాలి. అక్కడ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీకీ బ్రేక్ వేసిన సీపీఐ.. 1985లో ఉజ్జిని నారాయణ రావును తమ అభ్యర్థిగా నిలబెట్టి విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. 1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్థన్ రెడ్డి మళ్లీ విజయ దుందుభి మోగించారు. 2004 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్ రెడ్డి గెలిచారు. 2009లో సీపీఐ పార్టీ తరపున పోటీ చేసిన ఉజ్జిని యాదగిరి రావు గెలిచి.. మునుగోడు గడ్డపై మరోసారి కమ్యూనిస్టు జెండాను పాతారు.
ఇక్కడిదాకా ఎలా ఉన్నా.. రాష్ట్ర విభజన తర్వాత అక్కడ రాజకీయాలు మారిపోయాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో మునుగోడు గడ్డపై తొలిసారి టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. దీంతో మునుగోడుపై కారు పార్టీకి ఆశలు చిగురించాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో గెలిచిన టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టి మంచి మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గులాబీ ఆశలు గల్లంతయ్యాయి.
అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలోనే సీపీఐ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కిందనే వాదన ఉంది. కానీ.. చాలామంది కాంగ్రెస్ పార్టీ, రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ కారణంగా గెలుపు సాధ్యమైందని అంటున్నారు. సీపీఐ ఇప్పుడు టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇక దాని వైభవం, ప్రాబల్యం అంతరించినట్లే అనుకోవాలి.