బీజేపీ చేష్టలతో స్టాండప్ కమెడియన్ షోకు విశేష ప్రాచుర్యం లభిస్తోంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో షో నిర్వహించ తలపెట్టారు. ఇందుకు శిల్పకళ వేదికను ఎంచుకున్నారు. ఈ షోపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అందరి దృష్టిని అకర్షించింది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పటికే ప్రకటించారు. మతపరమైన విద్వేషాలను మునావర్ రెచ్చగొడుతున్నారని రాజాసింగ్ ప్రధాన ఆరోపణ. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఘాటు విమర్శలు చేశారు. షోను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం జరిగే షోపై సర్వత్రా టెన్షన్ నెలకుంది.
షోను అడ్డుకుంటామని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శిల్పకళా వేదిక గేట్లు సాయంత్రం 4:45కే మూసివేయనున్నట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు. ప్రేక్షకులు షో టికెట్‌తో పాటుగా ఆధార్ కార్డును కూడా తీసుకురావాలని సూచించారు. మిగిలిన ఏ ఒక్క వస్తువును అనుమతించమని నిర్వాహకులు స్పష్టం చేశారు. సెల్‌ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని తేల్చి చెప్పారు.
ఇదిలా వుండగా హెచ్చరికల నేపథ్యంలో షోపై విపరీత ప్రచారం జరుగుతోంది. పైసా ఖర్చు లేకుండా షో గురించి ప్రతి ఒక్కరికీ బీజేపీనే తెలియజేస్తున్నట్టైంది. అయితే షో ముగిసే వరకూ ఉత్కంఠ కొనసాగే పరిస్థితి నెలకుంది.