ఆ మధ్య క్రష్ అంటూ ఓ అడల్ట్ సినిమాతో రవిబాబు కాస్త హడావిడి చేశాడు గుర్తుందా..? ఆ తర్వాత ఆ సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు, ఎలాంటి హంగామా లేదు. అలా ఏమైందో తెలియకుండా, జనాల మైండ్ నుంచి కూడా వెళ్లిపోయిన ఈ సినిమా సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా, కామ్ గా క్రష్ సినిమాను ఈరోజు జీ5 లో స్ట్రీమింగ్ కు పెట్టారు.
అల్లరి అనే సినిమాతో దర్శకుడైన రవిబాబు, క్రష్ తో మరోసారి మూలాల్లోకి వెళ్లాడు. వరుసగా ఫ్లాపులు వెక్కిరిస్తున్న వేళ.. తన మొదటి సినిమా ఫార్మాట్ లోకి ఇంకోసారి దూరిపోయాడు. “అల్లరి” సినిమాను అప్పటి ట్రెండ్, సెన్సార్ నిబంధనలకు లోబడి తీసిన రవిబాబు.. ఈసారి “క్రష్”తో ఏకంగా గేట్లు ఎత్తేశాడు.
ఈకాలం ఓ అడల్ట్ సినిమాను ఎంత విచ్చలవిడిగా తీయొచ్చో, అంత పచ్చిగా క్రష్ ను తీశాడు. రొమాంటిక్ కామెడీ అనే జానర్ పేరును పైకి చెప్పుకుంటున్నప్పటికీ ఇందులో కామెడీ కంటే రొమాంటిక్ క్రష్సే ఎక్కువగా కనిపించింది. కండోమ్ వాడకం నుంచి సెక్స్ యాంగిల్స్ వరకు దర్శకుడు అన్నీ చర్చించాడు/చూపించాడు.
నటి సాయి సుధ గుర్తుందా.. సినిమాల్లో చేసిన పాత్రల కంటే ఆమధ్య వెలుగులోకి వచ్చిన ఓ వివాదంతోనే ఈమె బాగా పాపులర్ అయింది. కెమెరామేన్ శ్యామ్ కె.నాయుడు తనను మోసం చేశాడంటూ ఆమె వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఆమెనే ఈ క్రష్ లో మెయిన్ ''పిల్లర్''. సాయిసుధ పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని ట్రయిలర్ లోనే రుచిచూపించిన రవిబాబు.. సినిమాలో ఆమె అందాల్ని కెమెరా యాంగిల్స్ తో పూర్తిస్థాయిలో క్రష్ చేశాడు.