షర్మిల పార్టీ పెట్టారు.. మరి వలసల సంగతేంటి?

కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే.. పాత బ్యాచ్ కి పండగే. తమ సీనియార్టీకి సరైన న్యాయం జరగలేదని భావించే వారంతా కొత్త పార్టీలో పెత్తనం కోసం ఎదురు చూస్తుంటారు. మరి కొత్తగా తెలంగాణలో వచ్చిన…

కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే.. పాత బ్యాచ్ కి పండగే. తమ సీనియార్టీకి సరైన న్యాయం జరగలేదని భావించే వారంతా కొత్త పార్టీలో పెత్తనం కోసం ఎదురు చూస్తుంటారు. మరి కొత్తగా తెలంగాణలో వచ్చిన వైఎస్సార్టీపీ సంగతేంటి..? షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నానని ప్రకటించిన వెంటనే వలసలుంటాయని అనుకున్నారంతా. 

అప్పట్లో వైఎస్ఆర్ తో కలసి పనిచేసినవారు, ఆయన అభిమానులంతా షర్మిల గూటికి చేరతారని భావించారు. కానీ రోజులు గడిచాయి, షర్మిల పార్టీ జెండా, అజెండా కూడా ప్రకటించారు. అసలు ఆవిర్భావ వేదికపై పెద్ద తలకాయలు సడన్ సర్ ప్రైజ్ ఇస్తాయని అనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. 

షర్మిల పార్టీలోకి ఇంకా వలసలు మొదలు కాలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ప్రస్తుతానికి షర్మిల మాత్రమే కనిపిస్తున్నారు. నంబర్-2 ఎవరు? ఇతర ముఖ్యనేతలెవరు? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

టీఆర్ఎస్ నుంచి ఉంటాయా?

అధికార పార్టీ టీఆర్ఎస్ లో అసంతృప్తులున్నా కూడా వారు ఇప్పటికిప్పుడు బయటపడతారని, నేరుగా షర్మిల పార్టీలోకి వెళ్తారని అనుకోలేం. మనసు చంపుకొని పనిచేశానంటున్న ఈటల రాజేందర్ కూడా అధిష్టానం బయటకు నెట్టేయబట్టి పక్కకొచ్చేశారు కానీ, అన్నీ అనుకూలిస్తే అక్కడే ఉండేవారు. మరో రెండేళ్ల పాటు అధికారాన్ని అనుభవించేవారు. 

ప్రస్తుతానికి అధికార పార్టీలో చాలామంది కడుపునిండి ఉన్నారు. మరో రెండేళ్లు చింత, దిగులు లేకుండా ఉంటారు కూడా అయితే వచ్చే ఎన్నికలనాటికి అసంతృప్తి బ్యాచ్ పార్టీ ఫిరాయింపులకి సిద్ధంగా ఉంటుంది. టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడినవారికి వైఎస్సార్టీపీ ఆల్టర్నేట్ కావొచ్చు. బడానేతలు రాకపోవచ్చు కానీ భంగపడిన నేతలు మాత్రం షర్మిలకు దగ్గరయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్ నుంచి…

ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు షర్మిల పార్టీకి ఆశీస్సులందించారు కానీ, కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఆ పార్టీపై గట్టిగా పడింది. టైమ్ చూసి దెబ్బ కొట్టాలని చాలామంది సీనియర్లు ఎదురుచూస్తున్నారు. 

వైఎస్సార్ హయాంలో మంత్రులుగా పనిచేసిన చాలామంది, ఆయన అభిమానులు కొంతమంది సరిగ్గా ఎన్నికల టైమ్ కు కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. అలాంటి వాళ్లకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెద్ద ప్రత్యామ్నాయం అవుతుంది.

బీజేపీ, కమ్యూనిస్టుల నుంచి..

ప్రస్తుతానికైతే కేంద్రాన్ని చూసి మిడిసిపడుతోంది బీజేపీ. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. దుబ్బాక విజయం వాపో బలుపో, ఎమ్మెల్సీ ఎన్నికలనాటికి తేలిపోయింది. నాగార్జున సాగర్ పరాభవంతో ఇంకాస్త క్లారిటీ వచ్చింది. 

వచ్చే ఎన్నికలనాటికి బీజేపీలో కూడా టికెట్ల పంచాయితీ ఉంటుందనడంలో అనుమానం లేదు. సో.. అలాంటి వారంతా వైఎస్సార్టీపీవైపు చూడొచ్చు. వామపక్షాల్లో మిగులు జనాలే కరువయ్యారు కాబట్టి, రాకపోకలు ఉండే అవకాశం లేదు. 

ఇక జనసేన విషయానికొస్తే, ఇటీవల ఆ పార్టీ తరపున తిరుగుతూ కాస్తో కూస్తో జనాల్లో పేరు తెచ్చుకున్న నేతలకి, పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలతో పూర్తిగా క్లారిటీ వచ్చింది. తెలంగాణలో బీజేపీ ఉండగా, పవన్ సోలో పర్ఫామెన్స్ ఇచ్చే అవకాశమే లేదు. మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసైనికులకు జరిగిన పరాభవాన్ని అంతా చూశారు. సో.. ఆ బ్యాచ్ అంతా గుంపగుత్తగా కొత్త పార్టీ వైఎస్సార్టీపీకి మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదు.

వలసలు ఉంటేనే, పేరున్న నాయకులు కనపడితేనే పార్టీకి ఓట్లు పడతాయి. ఆ విషయం షర్మిలకి బాగా తెలుసు. అందుకే ఆమె ఇతర పార్టీల నేతల్ని నేరుగా టార్గెట్ చేయడం లేదు. కేవలం టీఆర్ఎస్ పై మాత్రమే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

ఇతర పార్టీల నుంచి నేతలు రాకపోతే కొత్త పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేదానికి జనసేనే ఓ నిదర్శనం. వలసలు లేక, పవన్ కొంతమందిని తీసుకోక జనసేన బలహీనమైంది. షర్మిల పార్టీ మరో జనసేన కాకూడదంటే.. వలసలతో బలం పెంచుకోవాల్సిందే. తర్వాతి రోజుల్లో కొత్త నాయకత్వాన్ని బలపరచుకోవాల్సిందే.