కొన్ని కొన్ని విషయాలు బయట పడితే.. ఈ దేశం ఎటు పోతోందో అర్థం కాని పరిస్థితి. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు పంగనామాలు పెట్టి కొంతమంది పరార్ అవుతున్నారు, మరి కొందరు భారతీయ జనతా పార్టీలోకి చేరి తప్పించుకుంటున్నారు! ఇంకోవైపు ఇలాంటి డీఫాల్టర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వరాలను ఇస్తోంది!
సమాచార హక్కు చట్టం ప్రకారం.. ఒక కార్యకర్త సంపాదించిన సమాచారం ప్రకారం.. కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతూ ఉన్నాయి. దేశంలో బ్యాంక్ డీఫాల్టర్లలో ప్రముఖులు అయిన 50 మందికి గత కొంతకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ వరాన్నే ఇచ్చింది. వారికి సంబంధించిన 68,600 కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసింది ఆర్బీఐ. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. 68,600 కోట్ల రూపాయలు అంటే.. దేశంలో చాలా రాష్ట్రాల వార్షిక బడ్జట్ కన్నా చాలా చాలా ఎక్కువ!
ఈ రుణమాఫీతో లాభపడిన వారెవరో తెలిస్తే మరింత షాకే! పరారీలో ఉన్న గీతాంజలి జెమ్స్ అధినేత చోక్సీ, ఈడీ స్కానర్ లో ఉన్న సందీప్ ఝన్ ఝన్ వాలా.. ఇలాంటి వాళ్లకు సంబంధించిన రుణాలను మాఫీ చేశారు! వీరిలో పరారీలో ఉన్న చోస్కీ..అతడి గ్రూపులకు సంబంధించే దాదాపు 7 వేల కోట్ల రూపాయల రుణాలున్నాయని సమాచారం. అలాగే ఇలా బెనిఫిట్ అయిన వారిలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు తను తీసుకున్న అప్పులను వడ్డీ లేకుండా చెల్లించేస్తానంటూ విజయ్ మాల్యా అంటుంటే.. బ్యాంకులు అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు ఇలా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు రుణమాఫీ అయ్యిందంటే.. అసలేం జరుగుతున్నట్టు?
ఈ ప్రహసనంలో మరో ప్రహసనం ఏమిటంటే.. బాబా రాందేవ్ అండ్ బాలకృష్ణ గ్రూప్ కూడా ఈ రుణమాఫీలో భారీగా లబ్ధి పొందిందట. ఈ కాషాయధారి కంపెనీకి సంబంధించి 2,212 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసేశారట. ఒక వైపు గత ఐదారేళ్లలో రాందేవ్ బాబా వ్యాపార సామ్రాజ్యం అతిభారీగా విస్తరించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలా లాభాల్లో ఉన్న కంపెనీకి కూడా ఏకంగా రెండు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడం కష్టం ఏమీ కాదు.
ఈ మాఫీ అంతా వీరభక్త నరేంద్రమోడీ ప్రభుత్వ హయాంలో జరిగినదే అండోయ్! దేశంలో రైతు రుణాలను మాఫీ చేయమని అడిగితే.. రైతులను బాగు చేయడానికి రుణమాఫీ పరిష్కారం కాదని మోడిత్వ మేధావులు కూడా చెబుతుంటారు. అయితే, ఇలా డీఫాల్టర్లకు మాత్రం మాఫీ చేయడమే వ్యవస్థకు మేలు అని భావించారేమో!
విల్ ఫుల్ డీఫాల్టర్లు అయిన 50 మందికి చేసిన రుణమాఫీ వివరాలను, వారి పేర్లను బయట పెట్టాలని వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో కోరగా, అందుకు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ నిరాకరించగా, ఆ వివరాలను తెలపాలంటూ తను ఆర్టీఐ ద్వారా ఆశ్రయించినట్టుగా.. ఈ వ్యవహారాన్ని బయటకు తీసుకు వచ్చిన ఆర్టీఐ కార్యకర్త చెప్పాడు. ఇంతకీ విల్ ఫుల్ డీఫాల్టర్లకు, పరారీలో ఉన్న వారికి చేసిన ఈ రుణమాఫీని దేశభక్తిలోని ఏ చాప్టర్లో చేర్చాలో!