లాక్ డౌన్ వేళ.. రాజకీయ నాయకుల్లో చాలామంది జనాలకు సేవా కార్యక్రమాలు చేస్తూ రోజువారీ వార్తల్లో ఉంటున్నారు. టీడీపీ బ్యాచ్ ఇంట్లోనే కూర్చుని నిరాహార దీక్షల పేరుతో పెద్ద డ్రామాలాడుతూ.. వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు. చంద్రబాబు అయితే వీడియో కాన్ఫరెన్స్ లతో హోరెత్తిస్తున్నారు. పార్టీల అధినేతల దగ్గర్నుంచి, చోటామోటా నేతల వరకు లాక్ డౌన్ ఉన్నా కూడా ఏదో ఒక కారణంతో తమ ఉనికిని చాటుకుంటున్నారు. నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ మాత్రం లాక్ డౌన్ ప్రారంభించాక ఒక్కసారి కూడా బైటకు రాలేదు, కనీసం ఇంట్లో నుంచి ఒక్క ఫొటో కూడా అప్ లోడ్ చేయలేదు.
వకీల్ సాబ్ షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లిన పవన్ కల్యాణ్, లాక్ డౌన్ వేళ అక్కడే లాక్ అయిపోయినట్టు తెలుస్తోంది. జనతా కర్ఫ్యూ రోజు రాత్రి గంట కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ప్రకటించిన లాక్ డౌన్ కి అందరూ సహకరించాలంటూ ఓ వీడియో సందేశాన్ని వదిలారు. అంతే.. ఆ తర్వాత పవన్ ఎక్కడా కనబడలేదు, దాదాపు నెల రోజులవుతోంది కనీసం ఒక ఫొటో కూడా విడుదల చేయలేదు.
అయితే ట్విట్టర్ లో అప్ డేట్స్ మాత్రం దంచికొడుతున్నారు. మొదట్లో కేవలం ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న సహాయ కార్యక్రమాలను రీట్వీట్ చేసిన పవన్, జనసేన నాయకుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తమవారు చేస్తున్న పనుల్ని కూడా హైలెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం చిన్నా చితకా లీడర్లందరి సేవా కార్యక్రమాల్ని రీట్వీట్ చేస్తూ ప్రోత్సహిస్తున్నారు కానీ, తాను మాత్రం ఎక్కడా బైటపడటంలేదు.
అడపాదడపా చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సులంటూ జనాలకి కనపడుతున్నారు, కానీ పవన్ కల్యాణ్ మాత్రం అడ్రస్ లేకుండా పోయారు. కరోనా క్రైసిస్ చారిటీ కి ఫండ్ ఇచ్చినప్పుడు, ప్రధాని, ముఖ్యమంత్రుల సహాయనిధులకు విరాళం ఇచ్చినప్పుడు కూడా కేవలం ట్విట్టర్ మెసేజ్ లకే పరిమితమయ్యారు. ఇక సినీ ఇండస్ట్రీ అంతా బి ద రియల్ మేన్ ఛాలెంజ్ అంటూ ఇల్లు తుడుస్తూ, అంట్లు తోముతూ రెచ్చిపోతుంటే, పవన్ ఆ జోలికే పోలేదు. విచిత్రంగా ఎవరూ పవన్ కల్యాణ్ ని నామినేట్ చేయలేదు కూడా.
మొత్తమ్మీద పవన్ పూర్తిస్థాయిలో లాక్ డౌన్ ను ఫాలో అవుతున్నట్టున్నారు. కనీసం తన ముఖం కూడా ఎవ్వరికీ చూపించడం లేదు. అయినా ఇలా ఉన్నఫలంగా మాయమైపోవడం పవన్ కు కొత్తేంకాదు. గతంలో ఎన్నోసార్లు ఇలా అంతర్థానయయ్యారు. చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ ప్రత్యక్షమయ్యేవారు. పవన్ న్యూ లుక్ అంటూ ఫ్యాన్స్ ట్రెండింగ్ చేసేవారు. ఈసారి కూడా అదే రిపీట్ అవుద్ది.