పరీక్షలు.. పరీక్షలు.. వీలైనన్ని టెస్టులు చేయడమే కరోనా వైరస్ నివారణకు పరిష్కార మార్గం అని అంటున్నారు అమెరికన్ మేధావులు. కరోనా చేత తీవ్రంగా బాధింపబడుతున్న దేశాల్లో అమెరికా ముందు వరసలో ఉంది. ఈ క్రమంలో అటు అమెరికాకు, ఇటు ప్రపంచానికి అక్కడి పరిశోధకులు ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నారు.
కరోనా టెస్టుల సంఖ్య భారీ ఎత్తున పెరగాలని.. వారు సూచిస్తూ ఉన్నారు. అప్పుడే కరోనాను కట్టడి చేయడానికి వీలవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. కరోనా అనేది ఆల్రెడీ సామాజిక వ్యాప్తి దశలో ఉంది. కొందరిలో ఆ వైరస్ లక్షణాలు ఏమీ కనపడవు, వారిలో వచ్చిందీ-వెళ్లింది ఏమీ తెలీదు. అయితే వారు క్యారియర్స్ గా అవుతున్నారని వైద్య పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో.. కరోనా వైరస్ పరీక్షలను సామాజికంగా చేపట్టాలని అమెరికన్ పరిశోధకులు చెబుతున్నారు.
వారు సూటిగా చెబుతున్న మాట ఏమిటంటే.. ప్రతి పౌరుడికీ కరోనా నిర్ధారణ పరీక్ష చేయాలనేది! ఈ సలహానే వారు అమెరికన్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. రెండు వారాల సమయాన్ని పెట్టుకుని.. అమెరికాలో ప్రతి ఒక్కరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని, ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు పూర్తి అయితే కరోనా వైరస్ ఒక కొలిక్కి వస్తుందనేది వారి అంచనా!
ఇండియాకు అయినా ఇదే పరిష్కార మార్గం అని అంటున్నారు పరిశోధకులు. రెండు వారాల వ్యవధిలో ప్రతి ఒక్క పౌరుడినీ పరీక్షించమని చెబుతున్నారు. అంటే సగటున ఇండియాలో రోజుకు పది కోట్ల పరీక్షలు జరగాలి! బహుశా అది అసాధ్యం. అయితే వీలైనంతగా పరీక్షల సంఖ్య పెరగడం మాత్రమే పరిష్కారం. ఇక నుంచి ఏ రాష్ట్రం అయినా కరోనా కేసుల సంఖ్యను చెబితే వాటిని పట్టించుకోనక్కర్లేదు. అది ఎన్ని పరీక్షలు చేసిందనేదే కీలకం.
కరోనా వ్యాప్తి ఇప్పటికే నమోదు అయిన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువగా పరీక్షలు చేయాల్సి ఉంది. అలా ఎక్కువ పరీక్షలు చేసినప్పుడు ఎక్కువ కేసులు కూడా బయటపడవచ్చు. అలా బయటపడటం వల్ల మాత్రమే కరోనా నిరోధం వీలవుతుంది. పరీక్షలు పెద్దగా చేయకుండా, తమ రాష్ట్రంలో కరోనా లేదని ఎవరు ప్రకటించినా.. అది మోసపుచ్చడమే అవుతుంది, సరైన స్థాయిలో పరీక్షలు జరగకపోతే.. కరోనా చాపకింద నీరులా చేరిపోవచ్చు. ఇప్పుడు దేశంలో ఏపీ, మహారాష్ట్రలు కరోనా పరీక్షల్లో ముందున్నాయి. మిగతా రాష్ట్రాలు మాత్రం తక్కువ స్థాయిలో పరీక్షలు చేస్తూ, తమ దగ్గర తక్కువ కేసులున్నాయని చెబుతున్నాయి.