ఎన్టీఆర్‌కు నివాళి ఇలా కాదు ప‌వ‌న్‌!

ఇవాళ ఎన్టీఆర్ జ‌యంతిని టీడీపీ ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు దివంగ‌త ఎన్టీఆర్ గొప్ప‌తనాన్ని ఆవిష్క‌రించారు. ఆయ‌న‌తో త‌మ జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ఎన్టీఆర్ లాంటి సినీ హీరో, రాజ‌కీయ నేత ఇక…

ఇవాళ ఎన్టీఆర్ జ‌యంతిని టీడీపీ ఘ‌నంగా జ‌రుపుకుంటోంది. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు దివంగ‌త ఎన్టీఆర్ గొప్ప‌తనాన్ని ఆవిష్క‌రించారు. ఆయ‌న‌తో త‌మ జ్ఞాప‌కాల‌ను పంచుకున్నారు. ఎన్టీఆర్ లాంటి సినీ హీరో, రాజ‌కీయ నేత ఇక పుట్ట‌రంటూ కొనియాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు.

ప‌వ‌న్‌కల్యాణ్ శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ తెలుగు గ‌డ్డ‌పై జ‌న్మించిన విశిష్ట వ్య‌క్తుల్లో ఎన్టీఆర్ కూడా ఒక‌ర‌ని కీర్తించారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించి అభ్యుదయవాదిగా ఎన్టీఆర్ నిలిచారన్నారు.  

తెలుగు భాషపై ఆయనకు ఉన్న మక్కువ, పట్టు త‌న‌ను ఎంత‌గానో ఆకట్టు కునేదన్నారు. తెలుగు భాష కీర్తి ప్రతిష్టలను దేశం నలుదిశలా వ్యాపింప చేసిన తీరు అమోఘమని కొనియాడారు.

ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తొమ్మిది నెల‌ల్లో అధికారంలోకి వ‌చ్చి చ‌రిత్ర సృష్టించారు. ఎన్టీఆర్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌ధ్య సారూప్య‌త ఉంది. ఎన్టీఆర్‌లా ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా సినీ రంగం నుంచి వ‌చ్చారు. తెలుగు వారి ఆత్మ‌గౌర‌వం నినాదంతో టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి జ‌నంలోకి వెళ్లి ఆద‌ర‌ణ పొందారు. ప్ర‌శ్నించ‌డానికి, ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల పేరుతో జ‌న‌సేన పార్టీని 9 ఏళ్ల క్రితం ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థాపించారు.

పార్టీ స్థాపించిన త‌ర్వాత 2014లో వ‌చ్చిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పోటీ చేయ‌కుండా టీడీపీ-బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చి ప్ర‌చారానికి ప‌రిమిత‌మ‌య్యారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి టీడీపీ, బీజేపీల‌ను కాద‌ని బ‌రిలో నిలిచి, క‌నీసం తాను పోటీ చేసిన రెండు చోట్ల కూడా గెల‌వ‌లేక‌పోయారు. 

ఇప్ప‌టికీ ప్ర‌త్యామ్నాయ‌శ‌క్తిగా ఎద‌గాల‌న్న ప‌ట్టుద‌ల‌, ఆశ‌యం ప‌వ‌న్‌లో క‌నిపించ‌డం లేదు. ఎన్టీఆర్‌కు నిజ‌మైన నివాళి అంటే….ఆయ‌న‌లా రాజ‌కీయాల్లో రాణించ‌డ‌మే. ఈ విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తెరిగి అర్థ‌వంత‌మైన రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.