సాధారణంగా రాజకీయాల్లో ఒక పార్టీ నాయకుడి జయంతో, వర్ధంతో నిర్వహిస్తే వేరే పార్టీల నాయకులు హాజరుకారు. ఒకవేళ కొందరు నాయకులకు మినహాయింపు ఉంటే ఉండొచ్చు. చెప్పలేం. కానీ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన, జాతీయ రాజకీయాలలో సైతం కీలక పాత్ర పోషించిన, సినిమాల్లో హీరోగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఒక విచిత్రం జరిగింది.
హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాటుకు పెద్దాయనకు నివాళులు అర్పించడానికి అధికార టీఆర్ఎస్ కు చెందిన చాలామంది మంత్రులు, కొందరు కీలక నాయకులు వెళ్లారు. నివాళులు అర్పించడమే కాకుండా కొందరు టీఆర్ఎస్ నాయకులు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తే, కొందరు భారతరత్న కోసం పార్లమెంటులో పోరాడతామని చెప్పారు.
టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు పొలోమంటూ ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారంటే ఇది వాళ్ళ సొంత నిర్ణయమై ఉండదు. సీఎం కేసీఆర్ అనుమతి తీసుకోకుండా వెళ్ళరు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా గులాబీ పార్టీ నేతలంతా ఇలా కలిసి కట్టుగా వచ్చి ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన సందర్భాలు లేకపోవటంతో ఈ సారి ఈ పరిణామం ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది. అందునా… గతంలో టీడీపీలో పని చేసి..టీఆర్ఎస్ లో చేరిన నేతలంతా ఒక్కటిగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుకున్నారు. టీడీపీ మాజీ ఎంపీ..ప్రస్తుత టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు నాయకత్వంలో వారంతా ఘాట్ వద్దకు వచ్చారు. టీడీపీలో ఎంపీగా పని చేసిన ప్రస్తుత మంత్రి మల్లారెడ్డి.. పువ్వాడ అజయ్ ..సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. టీడీపీ మాజీ నేతలు..ప్రస్తుత ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ.. వివేకానంద.. మాగంటి గోపీనాధ్ సహా పలువురు ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు.
కొందరు ఎన్టీఆర్ ను కీర్తిస్తూ ట్వీట్లు కూడా పెట్టారు. వీరిలో చాలామంది ఎన్టీఆర్ సినిమాలు చూసి, ఆ తరువాత టీడీపీలో చేరి రాజకీయాల్లో ఎదిగినవారే. కాబట్టి ఆయన మీద అభిమానం, గౌరవం ఉన్నా ఉండొచ్చు. అలా అనుకుంటే ఎన్టీఆర్ తో కానీ, ఆయన ఉన్నప్పటి టీడీపీతోగానీ టీఆర్ఎస్ కు ఎలాంటి వైరం లేదు. ఇంకా చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎన్టీఆర్ అభిమాని. ఆయన తన కుమారుడికి కూడా తారక రామారావు అని పేరు పెట్టారు. ఒకప్పుడు కేసీఆర్ టీడీపీలో కీలక నాయకుడు. కాబట్టి ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్ళడానికి ఆయనే పర్మిషన్ ఇచ్చి ఉండొచ్చు. ఎన్టీఆర్ ప్రధాని కావాల్సిన వ్యక్తి అంటూ టీఆర్ఎస్ నేతలు కొనియాడారు. ఎన్టీఆర్ కు భారత రత్న కోసం ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.
సీఎం కేసీఆర్ సైతం ఎన్టీఆర్ పేదల కోసం పడిన తపన గురించి వివరించే వారంటూ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, గతం కంటే భిన్నంగా మాజీ టీడీపీ నేతలంతా..ప్రస్తుతం టీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తూ..ఇలా ఎన్టీఆర్ కు నివాళి అర్పించటం వెనుక వ్యూహం ఏంటనేది చర్చకు కారణంగా మారింది. జాతీయ రాజకీయాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ రెండు మూడు నెలల్లో సంచలన నిర్ణయం ఉంటుందని ప్రకటించారు. ఇక, జాతీయ రాజకీయాల్లో తెలుగు గడ్డ నుంచి తొలి అడుగు వేసింది ఎన్టీఆర్. ఇప్పుడు గులాబీ పార్టీ నేతలు ఎన్టీఆర్ కు కలిసి కట్టుగా నివాళి అర్పించటం వెనుక ఎటువంటి రాజకీయం లేదని..ఎన్టీఆర్ శత జయంతి కావటంతోనే.. ఆయనకు నివాళి అర్పించామని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ కొన్ని ఊహా గానాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
అయితే, గత 20 ఏళ్లలో ఏనాడు లేని విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్’కు ఎన్టీఆర్ మీద ఇంత ప్రేమ, ఇంత భక్తి ఒక్క సారిగా ఎందుకు పుట్టుకొచ్చాయి? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే, కేసీఆర్ ఏది చేసినా, ఉచితంగా చేయరు. ప్రయోజనం లేదనుకుంటే మహాత్ముల జయంతి వర్ధంతి వేడుకలనే స్కిప్ చేస్తారు. అలాగే, కేసీఆర్ అనూహ్యంగా ఒక అడుగు వేశారంటే దాని వెనక ఒక రాజకీయ వ్యూహం, ఎత్తుగడ ఉండి తీరతాయి, అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదని, అదే విధంగా ఈ నిర్ణయం వెంక కూడా ఎదో వ్యూహం ఉండే ఉంటుందని, పరిశీలకులు భావిస్తున్నారు. ఇక ఇప్పడు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్న కేసీఆర్, అటు ఆంద్ర ఆరిజిన్ ఓటర్లను, ఇటు తెలుగు దేశం పార్టీ నాయకులు, క్యాడర్’ను బుట్టలో వేసుకునేందుకే ఎప్పుడు లేని విధంగా ఇప్పడు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొనడానికి మంత్రులకు, నాయకులకు అనుమతి ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాలో జరుగుతోంది.
తెలంగాణలో తెలుగు దేశం పార్టీ అంత బలంగా లేక పోయినా, పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తలు, కొందరు నాయకులు ఉన్నారు. నిజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ మంత్రి వర్గంలో సగం మందికి పైగా మంత్రులు అంతా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు శిక్షణలో నాయకులుగా ఎదిగిన మాజే టీడీపీ నాయకులే ఉన్నారు. అన్నిటినీ మించి బీసీల గుండెల్లో ఈనాటికీ ఎన్టీఅర్ బొమ్మ పదిలంగా వుంది, అందుకే, తెలుగు దేశం పార్టీ నాయకుల నుంచి క్యాడర్, ఓటర్ల వరకు అందరినీ తమ వైపుకు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్, ఎన్టీఆర్ జయంతిని వినియోగించుకునే వ్యూహంతో ఉన్నారని అంటున్నారు. నిజానికి, పార్టీలతో సంబంధం లేకుండా పనికొచ్చే, ‘పెద్ద’ లను సొంతం చేసుకోవడం కేసీఆర్ ‘కు కొత్త కాదని అంటున్నారు.
జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు శత జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి పీవీ కుటుంబాన్ని, పీవీ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకున్న చరిత్రను గుర్తు చేస్తున్నారు. పీవీని సొంతం చేసుకోవడమే కాకుండా దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ వరస ఓటముల క్రమంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలో, పీవీ కుమార్తె, సురభి వాణీ దేవికి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. సో.. ఇప్పడు ఎన్టీఅర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం కూడా పెద్దాయన మీద ఉన్న గౌరవంతోనో, భక్తితోనో కాదు, రాజకీయ అవసరం కోసమే అంటున్నారు.