జనసేన బుల్లి పార్టీనా…పొత్తుంటే అన్నే సీట్లా…?

జనసేన ఏపీలో మూడవ ఫోర్స్ గా ఎదగాలనుకుంటున్న పార్టీ. దానికి కావాల్సిన పొలిటికల్ గ్లామర్ గా పవన్ ఉన్నారు. ఇక సామాజికవర్గం పరంగా బలమైన మద్దతు సైతం ఉంది. అలాంటి జనసేన పొత్తు పెట్టుకుంటే…

జనసేన ఏపీలో మూడవ ఫోర్స్ గా ఎదగాలనుకుంటున్న పార్టీ. దానికి కావాల్సిన పొలిటికల్ గ్లామర్ గా పవన్ ఉన్నారు. ఇక సామాజికవర్గం పరంగా బలమైన మద్దతు సైతం ఉంది. అలాంటి జనసేన పొత్తు పెట్టుకుంటే ఏపీలో ఎవరికి లాభం అంటే కచ్చితంగా టీడీపీకే అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మరోమారు చంద్రబాబు సీఎం అవుతారు.

బాబు ప్రభుత్వంలో జనసేన వారికి ఒకటి రెండు మంత్రి పదవులు ఇచ్చినా ఇస్తారు. అయితే జనసేన సొంతంగా పోటీ చేస్తే నష్టం ఎవరికి అంటే అది కూడా టీడీపీయే అని చెప్పాలి. తాను గెలవకపోయినా టీడీపీని దెబ్బతీస్తుంది అన్న లెక్కలు కచ్చితమైనవి ఉన్నాయి.

ఈ నేపధ్యంలో జనసేన అవసరం ఎవరికి ఉంది అంటే జవాబు బహు సులువే. కానీ జనసేనను ఇంకా బుల్లి పార్టీగానే చూస్తోందా అంటే అవును అనే అంటున్నారు. జనసేనతో పొత్తు కావాలి. కానీ పొత్తు పేరిట ఎక్కువ సీట్లు ఇవ్వకూడదు. ఇదీ టీడీపీ నయా రాజకీయ వ్యూహంగా ఉంది అని తెలుస్తోంది.

జనసేనకు వచ్చే ఎన్నికల్లో పదిహేను ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లు ఇస్తామని టీడీపీ నాయకుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కూన రవికుమార్ చెబుతున్నారు. అంటే ఆ సీట్లకు ఒప్పుకుని జనసేన పొత్తు కడితే టీడీపీ రాజకీయంగా గరిష్ట లాభం పొందుతుంది అన్న మాట. ఇక్కడ జనసేన తీరు చూస్తే 2014 నాటిది కాదు అని తమ్ముళ్ళు ఎందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు అన్నదే డౌట్.

జనసేన పార్టీ ఈసారి అధికారం కోరుకుంటోంది. పవన్ ముఖ్యమంత్రి కావాలని కార్యకర్తలు చూస్తున్నారు. అలా కానినాడు ఆయన సొంతంగా పోటీ చేసిన 15 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకోలేరా అన్న ప్రశ్న కూడా ఉంది. మరి ఇలా తక్కువలో తక్కువ చేసి పిసినారి బేరాలు ఆడాలని చూస్తే జనసేన బుల్లి పార్టీ అయిపోదేమో కానీ టీడీపీకి మాత్రం భారీ నష్టం అంటున్నారు. 

సరే కూన రవికుమార్ సొంత అభిప్రాయమా ఇది లేక అధినాయకత్వమే ఇలా ఆలోచిస్తోందా అన్నది ఇపుడు చూడాలి. ఈ విషయంలో జనసేన మాట్లాడేది ఏదీ ఉండబోదు అనే అంటున్నారు.