చంద్రబాబు ముందున్న అతిపెద్ద శీలపరీక్ష

చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబునాయుడు 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేసారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అదే నియోజకవర్గానికి పాతినిధ్యం వహిస్తూ ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.  Advertisement…

చంద్రగిరి నియోజకవర్గం నుంచి రాజకీయప్రస్థానాన్ని మొదలుపెట్టిన చంద్రబాబునాయుడు 1989లో తొలిసారిగా కుప్పం నుంచి పోటీ చేసారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా అదే నియోజకవర్గానికి పాతినిధ్యం వహిస్తూ ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 

కానీ మొట్టమొదటి సారిగా కుప్పంలో ఆయన కుర్చీ కదులుతోంది. దీనికి తొలి అపశకునంగా స్థానిక ఎన్నికల ఫలితాలు కుప్పం ప్రజలు వైకాపావైపుకు మొగ్గారని చెప్పేసాయి. ఎందుకలా జరిగిందనడానికి ఒక్కటే కారణం. అన్నేళ్లు ఎమ్మెల్యేగిరి వెలగబెట్టినా చంద్రబాబు తన నియోజకవర్గాన్ని మునిసిపాలిటీగా మార్చకుండా పంచాయితీ స్థాయిలోనే ఉంచారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ ప్రాంతం మునిసిపాలిటీ అయిపోయింది. మంచి రోడ్లొచ్చాయి. స్థానికంగా ఉన్నంతలో అభివృద్ధి జరిగింది. గతం కంటే మెరుగైన జీవితం గడుపుతున్నారు అక్కడి ప్రజలు. పైగా రాష్ట్రంలోని అందరిలాగానే నవరత్నాలు కూడా టంఛనుగా అందుతున్నాయి. ఇక ప్రజలు వైకాపా వైపుకి మొగ్గకుండా ఎందుకుంటారు? 

జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్నది రాజకీయ చదరంగం. ప్రత్యర్థి వర్గంలో రాజుకి చెక్ పెట్టడం మీదే దృష్టి పెడతాడు సిసలైన చదరంగ క్రీడాకారుడు. తెలివైన ఎత్తులు వేస్తూ చాప కింద నీరులాగ కమ్మేసి “చెక్ మేట్” అంటాడు. అదే జరుగుతోంది ఇక్కడ. 

అదెలాగో చూద్దాం. 

తెలుగుదేశానికి కంచుకోటలు ముఖ్యంగా రెండు. ఒకటి బీసీల వోటు బ్యాంకు. కమ్మవారికి బీసీలు అండగా ఉండి ఇన్నేళ్లు రాజ్యాధికారాన్నిచ్చారు. కానీ ఇప్పుడు వారిలో అధిక శతాన్ని జగన్ తన వైపుకి లాగేసుకున్నాడు. అందుకే తెదేపాకి ఈ దుస్థితి. 

వీరికి తోడు ఎస్సీ, ఎస్టీ ఓటర్స్ లో అధికులు వైకాపాకే అండగా ఉన్నారు. జగన్ రాజకీయం కొంత, తెదేపా స్వయంకృతాపరాథం కొంత కలిసి కమ్మ సామాజిక వర్గాన్ని కార్నర్ చేసేసాయి. ఓటర్స్ గా వారి సంఖ్య ఒక పార్టీని గెలిపించుకునేంతగా లేదు. ఆమాటకొస్తే ఏ కులానికీ ఏకపక్షంగా ఆ శక్తి ఉండదు. నలుగురినీ కలుపుకున్నప్పుడే అది సాధ్యం. కానీ పచ్చ మీడియా అతివల్ల ఆ సామాజిక వర్గం తప్ప తెదేపా వైపుకి చూసే ఇతర కులస్థులు రాను రాను బాగా తక్కువైపోయారు. 

పోనీ కులాలని పట్టించుకోని న్యూట్రల్ ఓటర్ల విషయానికొద్దాం. వారికి యువకుడిగా జగన్ మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు, వృద్ధుడిగా చంద్రబాబు కనిపిస్తున్నారు. ఆయన వారసుడు లోకేష్ ఏ రకంగానూ జగన్ కి ప్రత్యామ్నాయంగా కనిపించడంలేదు. పవన్ కళ్యాన్ అసలు ఊసులో లేడు. అందుకే వాళ్లు జగన్ వైపే మొగ్గి ఉన్నారు. 

సరే ఇప్పుడు విషయానికొస్తే, ఈ సారి చంద్రబాబు కుప్పం నుంచి మాత్రమే నిలబడే ధైర్యం చేస్తారా? 

క్షేత్రస్థాయిలో ప్రస్తుతమున్న పరిస్థితి ఏంటంటే ఎలా చూసుకున్నా 20% మించి ఓట్లు ఈ సారి ఆయనకు పడేట్టు లేవు. కనుక ఓటమి తథ్యంలా ఉంది. అందుకే ఆ మధ్య ప్రెస్మీట్లో ఆయన గుక్క పెట్టి ఏడ్చుండొచ్చు. సరిగ్గా కుప్పం స్థానిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వేళావిషేషంలోనే ఆయన ఏడ్చింది. మూలిగే నక్కమీద తాటి పండులాగ భార్య టాపిక్కుతో అసెంబ్లీలో జరిగిన అవమానం కూడా తోడవడంతో పంటి బిగువున ఉన్న బాధ పెల్లుబికింది. ఆ ఏడుపే తెదేపాని కుదేలు చేసింది. ఒక నాయకుడు చేయకూడని పని బహిరంగంగా ఏడవడం. అది అతని బలహీనతని బయటపెడుతుంది తప్ప సానుభూతి కురిపించదు. 

సరిగ్గా ఎన్నికల ముందు ఓడిపోయే క్షేత్రంలో నిలబడడం తెలివైన పని అనిపించుకోదు. కనుక మరొక స్థానం నుంచి పోటీ చెయ్యాలి. 

ఆ నిర్ణయం తీసుకుంటే, “అదిగో భయపడ్డాడు. ఓడిపోతాడని తెలిసి వేరే దారి చూసుకున్నాడు” అంటారు. 

అలా అనిపించుకుంటే కొత్తగానిలబడే చోట కూడా గౌరవం ఉండదు.

“నలభై ఏళ్లు పాలించి నీ నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేకపోయావుగానీ ఇప్పుడు మా నియోజకవర్గాన్ని ఉద్ధరించడానికొచ్చావా?” అని అడగొచ్చు అక్కడి ప్రజలు. ప్రజలు అడక్కపోయినా ఇలాంటి పాయింట్ల మీద వైకాపా ప్రచారం మామూలుగా ఉండదు. 

పోనీ ఎవరేమన్నా, ఎలా విమర్శించినా పక్కన పెట్టి ధైర్యంగా పోటీ చేయాలంటే ఎక్కడ నుంచి చెయ్యాలి? హిందూపురమా? అమరావతా? వైజాగా? 

హిందూపురం తెదేపాకి గట్టి కోటే. అయితే ఎన్.టి.ఆర్ అభిమానులే అక్కడ ఎక్కువ. ఆ అభిమానంతోనే ఆయన వారసుడు కనుక బాలకృష్ణని గెలిపించుకుంటున్నారు. కానీ ఒక్కసారిగా బావమరిదిని ఇంట్లో కూర్చోపెట్టి బావగారు వచ్చి పొటీ చేస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయా అంటే అనుమానమే. “అప్పట్లో మామకి వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అవడానికి బావమరిదిని పొడిచాడు” అంటుంది వైకాపా వర్గం. 

ఎందుకొచ్చిన గోలని అమరావతి ప్రాంతమున్న మంగళగిరి నుంచి పోటీ చేయొచ్చా అనుకుంటే అక్కడి జనం యువరాజు లోకేష్ నే ఓడించేసారు. ఇప్పుడు కొడుకుని పక్కనపెట్టి తాను కూర్చుంటే కొడుకు పనికిరానివాడని లోకానికి తానే చెప్పినట్టవుతుంది. తీరా నిలబడ్డాక గెలుపొస్తుందా అలుపొస్తుందా అంటే రెండోదానికే అవకాశమెక్కువుంది. 

ఇక మిగిలిన మూడోది వైజాగ్. ఈప్రాంతం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆల్రెడీ మొన్నీమధ్య ఒక ఫీలర్ వదిలారు. కానీ అంతలోనే సర్దుకుని “మా నాన్నగారు కుప్పమే- నేను మంగళగిరే” అని లోకేష్ ప్రకటించారు. నిజానికి వైజాగులో ఏ నియోజకవర్గం నుంచి నిలబడ్డా జనం గొల్లున నవ్వొచ్చు. వైజాగుని రాజధానిగా ఒప్పుకోనివాడు అక్కడికొచ్చి నిలబడితే ఆదరిస్తారా? 

చెస్సాటలో ఒకచోట చెక్కు పెడితే పక్కగడిలోకి వెళ్లడానికి రాజుకి చాన్సుంటుంది. కానీ ఆ గడులు కూడా మూసుకుపోయి, ఎటుపోయినా చావు తప్పట్లేదన్నప్పుడు “చెక్ మేట్” అయ్యి ఆట ముగుస్తుంది. 

ఆ విధంగా రాజకీయంగా చంద్రబాబు ఆట ముగిసిపోవడానికి సంకేతాలైతే కనిపిస్తున్నాయి. మళ్లీ ముఖ్యమంత్రయ్యాకే అసంబ్లీలో అడుగుపెడతానని వాకౌట్ చేసిన వ్యక్తి ఈ సారి కనీసం ఎమ్మెల్యేగానైనా వస్తాడా అంటే డౌటే అన్నట్టుంది. 

కానీ చంద్రాబు, లోకేష్, పచ్చమీడియా శకటలు, చర్చల్లో పాల్గొనే భటులు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ తమ ఊహాప్రపంచంలో జీవిస్తూ మళ్లీ తెదేపా అధికారంలోకొస్తుందని పగటి కలలు కంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇదే ఇప్పుదు నడుస్తున్న చరిత్ర.