ఈ రోజు ప్రపంచానికి అతి పెద్ద సమస్య ప్లాస్టిక్. దీనిని భూతంగా కూడా అభివర్ణించారు. దీని వల్ల ప్రకృతి విలవిలలాడుతోంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఎన్నో కనీ వినీ ఎరుగని ఉపద్రవాలు చోటు చేసుకుంటున్నాయి. ప్లాస్టిక్ అన్నది సులువుగా ఉపయోగించడానికి బాగుంటుంది కానీ దీన్ని వదిలించుకోవడం బహు కష్టం అని ఆధునిక మానవుడికి అర్ధమవుతున్న విషయం.
ఈ నేపధ్యంలో మహా విశాఖ నగర పాలక సంస్థ విశాఖ మొత్తం మీద ప్లాస్టిక్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని అతి పెద్ద యాగాన్నే చేపడుతోంది. దీని కోసం సినీ ప్రముఖుల సహాయాన్ని తీసుకుంటోంది. అలాగే ప్రముఖులు మేధావులు తమకు తోచిన తీరున స్పందించి జన చైతన్యాన్ని తీసుకువస్తున్నారు.
ఈ క్రమంలో విశాఖలో ప్లాస్టిక్ నిషేధం పేరిత సాగుతున్న మహోద్యమాన్ని కీలక దశకు చేర్చడానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ శ్రీకారం చుడుతున్నారు. ఆయన ఈ నెల 26న విశాఖ రానున్నారు. ప్లాస్టిక్ నిషేధం వల్ల కలిగే ప్రయోజనాలను జనాలకు వివరించడంతో పాటు ప్లాస్టిక్ ని దైనందిన జీవితంలో నుంచి ఎలా దూరం చేయాలన్న దాని మీద అవగాహన కల్పించే కార్యక్రమాలలో జగన్ పాల్గొంటారు
అదే విధంగా విశాఖ బీచ్ చాలా అందమైనది. ఆ బీచ్ ని ఎలా కాపాడుకోవాలి. ఎలా స్వచ్చంగా ఉంచుకోవాలి అన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి నేరుగా కార్యక్రమాలలో పాల్గొని విశాఖ వాసులను చైతన్యం చేస్తారు. విశాఖకు ఈసారి జగన్ వస్తున్నది అధికారిక ప్రారంభోత్సవాలకు కాదు, అంతకంటే పెద్దదైన ఒక పవిత్ర ఆశయం కోసం. దాంతో జగన్ పాల్గొనే కార్యక్రమాలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. సీఎం పర్యటన కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.