మరో వారంలో పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఓ ఎమ్మెల్యేపై ప్రశంసల జల్లు కురిపించారు. అది కూడా తనను వ్యతిరేకించే వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధిని ఆత్మబంధువుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఇందుకు తిరుపతి వేదికైంది. మహాత్మాగాంధీజీ ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సొంతంగా ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సత్యశోధన పుస్తకంతో పాటు ప్రచురణకర్త, ప్రజాప్రతినిధి అయిన కరుణాకరరెడ్డితో తన ఆత్మీయ బంధాన్ని కూడా ఆవిష్కరించారు. ఆద్యంతం ఆత్మీయ ప్రసంగాన్ని ఎన్వీ రమణ కొనసాగించారు. ఎన్వీ రమణ ఏమన్నారంటే…
“మహాత్మగాంధీ వారసులుగా మనం గర్వించాల్సి. చాలా వరకూ ఆత్మకథలు వక్రీకరణలు, అతిశయోక్తులతో వుంటాయి. గాంధీజీ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా ఆత్మకథలో రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకంగా భావించి గాంధీజీ ఆత్మకథను కరుణాకర్ ప్రచురించారు. ఇదే విషయాన్ని పుస్తకం చివర అట్టపై రాశారు.
కరుణాకర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ఈ పరిణామం భవిష్యత్‌లో ఎటువైపు దారి తీస్తుందో నాకైతే అర్థం కాలేదు. దీనికి కొన్నిరోజులు వేచి చూడాలి. గాంధీజీ గురించి తెలియని భారతీయులు ఉండరు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఇతరత్రా కారణాలతో ఈనాటి యువతరం గాంధీజీని మరిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇదే కాదు, గాంధీజీకి సంబంధించి అనేక అంశాలను ప్రచురించాల్సి వుంది. ఆ బాధ్యతను కరుణాకర్‌రెడ్డిపై పెడుతున్నాను.
ప్రస్తుత రాజకీయాల్లో నిజం చెప్పడం చాలా కష్టమైన విషయం. అదే విధంగా చేసిన తప్పును ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. మీ అందరి సమక్షంలో నేను ఫలానా తప్పు చేశానని ఒప్పుకున్న కరుణాకర్‌ను ఏ రకంగా చూడాలా? ఏ రకంగా గౌరవించాలా?. ఎందుకంటే కరుణాకర్ చేసింది ఇది చిన్న విషయం కాదు. ఎంతో గొప్ప మనసుతో, పరివర్తన చెందిన మానవతా వాదిగా కరుణాకరరెడ్డి రుజువు చేసుకున్నారు. కరుణాకరరెడ్డి చాలా కాలంగా ఆప్తమిత్రుడు. ఆయన వృత్తి, నా వృత్తి ఒకటే కాకపోయినా… విద్యార్థి దశలోనే ఆయన వామపక్ష తీవ్రవాద రాజకీయాల్లోకి వెళ్లారు. అంతస్థాయిలో కాకపోయినా ఆ రాజకీయ భావాలకు నేను కూడా ఆకర్షితుడయ్యాను. ఎమర్జెన్సీలో రెండేళ్ల పాటు కరుణాకర్ జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో జైలు జీవితం గడిపిన అతి పిన్న వయస్కుడు కరుణాకర్‌రెడ్డి.
కరుణాకరరెడ్డిని చూసినప్పుడల్లా చాలా ఆశ్చర్యం కలుగుతుంటోంది. నేడు అడుగుతుంటాను…అసలు ఈ రాజకీయాల్లో ఎలా మనుగడ సాగిస్తున్నావని? తిరుపతిలో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా సొంత పార్టీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేశాడు. ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే. అయినప్పటికీ నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని చెప్పడం సామాన్యమైన విషయం కాదు.
దురదృష్టవశాత్తు ఆయన ఉన్న పార్టీ, అలాగే గతంలోనూ కరుణాకర్‌ను సరిగా ఉపయోగించుకోలేదు. ఆయన తెలుగు భాష సంస్కృతి పట్ల మక్కువ ఉన్న మనిషి. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, మేధావి, ప్రజలతో మమేకం అయ్యే, అలాగే సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు. పార్టీలకు అతీతంగా తన అభిప్రాయాల్ని చెప్పగలిగిన వ్యక్తి. మంచి లక్షణాలు కలిగిన నాయకుడిని ఈ రాజకీయ పార్టీలు ఉన్నత స్థానంలో ఎందుకు ఉంచవో నాకు అర్థం కాదు. బహుశా ఆయన ముక్కుసూటితనం, నిర్మొహమాటతత్వం నచ్చని పరిస్థితి ఉందేమో. అయినప్పటికీ ప్రజల కోసం ఆయన సేవలను వాడుకుంటారని ఆశిస్తున్నా.
తద్వారా తెలుగు ప్రజలకు చాలా మేలు చేసిన వారు అవుతారు. కరుణాకరరెడ్డి నా వద్దకు చాలాసార్లు వచ్చారు. అయితే పైరవీల కోసమో, పనులు చేయించుకోడానికో రాలేదు. సాహిత్యం, భాష, దేశంలోని అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు, దేశ ఆర్థిక అంశాల గురించి చర్చించేవారు. అంతే తప్ప తనకు పేవర్ చేయాలని ఏనాడూ కోరలేదు. చాలా విచిత్రమనిపిస్తుంది. ఏ మాత్రం పరిచయం లేనివాళ్లు కూడా పనులు చేయాలని మమ్మల్ని అడుగుతుంటారు.
కొన్ని సందర్భాల్లో నాపై ఎవరైనా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించినా, విమర్శించినా ఏ మాత్రం సహించేవాడు కాదు. దాని మూలంగా ఆయనకు వచ్చే అవకాశాలు పోతాయని, కొంత మందికి శత్రువు అవుతాడని తెలిసి కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడించి నా తరపున నిలబడిన కరుణాకరరెడ్డి ఆత్మబంధువు, అపూర్వ సహోదరుడు, సొంత సోదరుల కంటే గొప్పవాడు. ఇంత మంచి నాయకుడిని తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు అభినందనలు.
నాయకత్వ, విలువలు కలిగిన, నిజాయతీ కలిగిన వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. కరుణాకర్‌కు అన్ని రకాలుగా అండదండగా ఉంటారని కోరుకుంటున్నా” అని ఎన్వీ రమణ అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ ఇంత వరకూ ఎవరిపైనా ఇలా వ్యక్తిగతంగా మాట్లాడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార పార్టీతో న్యాయ వ్యవస్థకు ఉన్న ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఎన్వీ రమణ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.