తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సంస్కారానికి భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సాక్షిగా సభంతా ఆశ్చర్యపోయింది. కరుణాకరరెడ్డి భావోద్వేగ, పశ్చాత్తాప ప్రసంగానికి సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. వివిధ సందర్భాల్లో తాను చేసిన తప్పిదాలకు క్షమాపణ చెప్పడానికి ఇదే సరైన వేదికని ఆయన అన్నారు. ఇందుకు మహాత్మాగాంధీ ఆత్మకథ “సత్యశోధన” పుస్తకావిష్కరణ సభ వేదిక కావడం విశేషం.
ఈ పుస్తకావిష్కరణ సభకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కరుణాకర్ ఆప్తుడైన జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పుస్తకాన్ని పునర్మిద్రించడానికి దారి తీసిన పరిస్థితులను ఎమ్మెల్యే వివరించారు. ఇదే సందర్భంలో ఆయన ఉద్వేగపూరిత ప్రసంగంలో సంచలనాలు చోటు చేసుకున్నాయి. పుస్తకావిష్కరణలో సభలో కరుణాకరరెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“స్వాతంత్ర్య పోరాటానికి మాత్రమే గాంధీజీ పరిమితం అయ్యారనుకుంటే అంతకంటే తప్పిదం మరొకటి లేదు. గాంధీ జీవితం స్వాతంత్ర్య పోరాటం కంటే ఈనాడు మన తరానికి మరింత ఎక్కువ అవసరం. ప్రపంచమంతా రాజులు, భూస్వాములు, దోపిడీ దారులు, దౌర్జన్యకారులతో నిండిపోయిన చరిత్ర కలిగిన వ్యవస్థలో గాంధీజీ ఆశయం, ఆచరణగా మారింది. కళ్లాకపటం, దుర్మార్గం, దోపిడీ, దౌర్జన్యం తెంపరితనం, తుంటరితనం, ఇలాంటి వాటికి అందమైన మారుపేర్లు తగిలించుకుని సజీవంగా వికృత చేష్టలతో మనగలుగుతున్న సమాజంలో ఉన్న మనం గాంధీజీ జీవితాన్ని చదవాల్సిన అవసరం వుంది.
ఒక రాజకీయ నాయకుడు ఇలా మాట్లాడుతున్నాడే అని మీ అందరికీ అనిపించొచ్చు. కానీ నేను గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని గడపకపోయినా, బతకాలని కోరుకున్న మనిషిగా ఆనాడు తీవ్రవాద రాజకీయాల వల్ల జరిగిన నేరాలకు, అలాగే ప్రజాస్వామ్య రాజకీయాల్లో జరిగిన అపచారాలకు, చేసిన తప్పులకు భారత ప్రధాన న్యాయమూర్తి ఎదుట నిందితునిగా చేతులు కట్టుకుని నిలబడి క్షమాపణలు కోరుకుంటున్నా. నేనొక కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇస్తున్నా. రాజకీయాల్లో మార్పు రాకపోతే మానవ జాతి మనుగడకే ప్రమాదం. ప్రతి రాజకీయుడూ తప్పక చదవాల్సిన మొదటి, ఆఖరి పుస్తకం గాంధీజీ ఆత్మకథ సత్యశోధనే” అని కరుణాకరరెడ్డి తెలిపారు.
కరుణాకరరెడ్డి ప్రసంగానికి సభికులంతా ఆశ్చర్యపోయారు. తప్పులు చేయడం తమ ప్రజాస్వామ్య హక్కుగా భావించే రాజకీయ వ్యవస్థలో బతుకుతున్న మనకు కరుణాకరరెడ్డి క్షమాపణ చెప్పడం విడ్డూరంగా, ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఎందుకంటే తలకిందుల సమాజంలో నీతిబాహ్యంగా బతికితే తప్ప మనుగడ లేని కాలం ఇది. అలాంటి రాజకీయ వ్యవస్థలో తాను కూడా క్రియాశీలక భాగస్వామిగా వుంటూ తప్పిదాలకు మన్నించాలని… అది కూడా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎదుట వేడుకోవడం తప్పక ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ కరుణాకరరెడ్డి సంస్కారాన్ని ఈ ఎపిసోడ్ ఆవిష్కరిస్తుందనడంలో సందేహం లేదు. గిట్టని వాళ్లు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఇదే సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాటల్లో చెప్పాలంటే… చేసిన తప్పులను ఒప్పుకోవాలంటే ఎంతో ధైర్యం, నిజాయతీ వుండాలి.