తిరుపతి జిల్లాలోని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఖరితో అధికార పార్టీ కార్యకర్తలు విసిగిపోయారు. దీంతో త్వరలో ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌ను నియమించడానికి రంగం సిద్ధమైనట్టు తెలిసింది. నిజానికి ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. గత సార్వత్రిక ఎన్నికల్లో 45 వేలకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. అయితే ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలితో ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులు విసిగిపోయారు.
పార్టీలో గొడవలు పెడుతూ, పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శ ఆ ఎమ్మెల్యేపై వుంది. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఇన్‌చార్జ్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో ఈయన పార్లమెంట్ సభ్యుడిగా పని చేస్తూ, తన నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సఖ్యతగా లేని సంగతి తెలిసిందే.
ఈ కారణంగానే పార్లమెంట్‌కు ఆయన్ను వైఎస్ జగన్ పంపలేదు. అయితే తన ఆదేశాలను మన్నించి ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చారనే చర్చ జరుగుతోంది. కానీ జగన్‌తో పాటు వైసీపీ పెద్దలు పలుమార్లు సదరు ఎమ్మెల్యేతో పద్ధతి మార్చుకుని, కార్యకర్తలు, నాయకులందరినీ కలుపుకెళ్లాలని కోరినా… ఫలితం కనిపించడం లేదు. ఇక ఉపేక్షిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.
సదరు ఎమ్మెల్యే స్థానంలో దివంగత ఎంపీ కుమారుడు లేదా గతంలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పని చేసిన నాయకుడికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారనే చర్చ వైసీపీలో పెద్ద ఎత్తున నడుస్తోంది.