కోమటిరెడ్డికి అసలు సవాల్.. ఒక్కరోజులో ఎంత?

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, భారతీయ జనతా పార్టీలోనే తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు! అందుకోసం బిజెపి అధినాయకత్వం దృష్టిలో తన ప్రాబల్యాన్ని, బలాన్ని చాలా ఘనంగా…

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, భారతీయ జనతా పార్టీలోనే తన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశపడుతున్నారు! అందుకోసం బిజెపి అధినాయకత్వం దృష్టిలో తన ప్రాబల్యాన్ని, బలాన్ని చాలా ఘనంగా నిరూపించుకోవాలని ఆయన ఆరాటపడుతున్నారు. 

కేవలం అందుకోసమే భారతీయ జనతా పార్టీలో తాను చేరే సందర్భాన్ని ఒక భారీ బహిరంగ సభ రూపంలోకి తీసుకువస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రప్పిస్తున్నారు. ఈ సభ ఎంత విజయవంతంగా జరిగితే మునుగోడు నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికలకు కూడా అంతగా ఉపకరిస్తుందని.. తమ హవా ఉన్నట్లుగా చాటుకోవచ్చునని.. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఆశపడుతున్నారు.

అయితే ఈనెల 21వ తేదీన మునుగోడు లో జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించి జన సమీకరణ అనేదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అతిపెద్ద సవాలుగా మారనుంది. మామూలు పరిస్థితుల్లో అయితే, అమిత్ షా స్థాయి సభకు కొన్ని లక్షల మంది జనాన్ని పోగేస్తే సరిపోతుంది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తే సరిపోతుంది. అందుకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైన గణాంకాలు వారి దగ్గర సిద్ధంగా ఉంటాయి. 

అయితే ఇప్పుడు నిర్వహించబోయే సభ కొంత విభిన్నమైనది. ముందు రోజే అక్కడ గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మరురోజు భారతీయ జనతా పార్టీ పెట్టబోయే కార్యక్రమం తెరాస కంటే చాలా పెద్ద స్థాయిలో ఉంటే తప్ప జనంలో వాళ్లు తెరాస కంటె బలమైన శక్తిగా చాటుకోలేరు.
 
తెరాస పెట్టబోయే సభ కంటే అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ సభకు జన సమీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధ్యత అవుతుంది. ప్రస్తుతం అదే ఆయనకు అతిపెద్ద సవాలుగా మారనుంది!

కేసిఆర్ 20వ తేదీన మునుగోడులో సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు నియోజకవర్గంలో ఉండే ప్రతి చిన్న గ్రామం నుంచి కూడా జనాన్ని సమీకరించాలని కనీవినీ ఎరుగని రీతిలో జన సమీకరణ ఉండాలని, ఆల్రెడీ పార్టీ శ్రేణులకు దేశాన్ని నిర్దేశం చేయడం జరిగింది! కేసీఆర్ సభ 20వ తేదీ సాయంత్రం ముగుస్తుంది! 21వ తేదీ మధ్యాహ్నానికి అమిత్ షా సభ అక్కడ జరుగుతుంది. 

కేసీఆర్ సభ ముగిసినప్పటి నుంచి అమిత్ సభ మొదలయ్యేలోగా దానికి మించిన స్థాయిలో జనాలను సమీకరించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. లేకపోతే గులాబీ సభ ముందు కమలం సభ తేలిపోయిందనే అపకీర్తి వారికి తప్పదు! అందుకే ఒకే ఒక్క రోజులో ఎన్ని లక్షల మందిని అదనంగా సమీకరించడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంసిద్ధంగా ఉంటారు.. అనేదాన్ని బట్టి సభ విజయవంతం కావడం ఉంటుంది! 

ప్రస్తుతం మునుగోడు రాజకీయం మొత్తం జన సమీకరణ చుట్టూ తిరుగుతోంది. డబ్బులు ఇస్తే తప్ప సభకు జనం రాని రోజులు ఇవి! సో ఇంకా నోటిఫికేషన్ వెలువడని ఒక ఉపఎన్నిక కోసం ఇప్పటినుంచే కోట్లకు కోట్ల రూపాయల ధన ప్రవాహం మొదలైందని భావించాల్సి వస్తోంది!!