ఫైల్ క్లోజ్: క్లారిటీగా ఎండ్ కార్డ్ వేసిన సీఐడీ డీజీ!

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ముగిసిపోయినట్టే. దీనిమీద ఇక ఎలాంటి అప్ డేట్ ఉండే అవకాశమే లేదు. కాకపోతే మరికొన్ని రోజుల పాటూ తెలుగుదేశం, జనసేన ఇతర విపక్షాలు ‘మాధవ్ న్యూడ్ వీడియో’…

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ముగిసిపోయినట్టే. దీనిమీద ఇక ఎలాంటి అప్ డేట్ ఉండే అవకాశమే లేదు. కాకపోతే మరికొన్ని రోజుల పాటూ తెలుగుదేశం, జనసేన ఇతర విపక్షాలు ‘మాధవ్ న్యూడ్ వీడియో’ అనే టాపిక్ మీద యాగీ చేస్తూ ఉండవచ్చు. దర్యాప్తు, విచారణ, ఫోరెన్సిక్ నివేదిక వాటి పర్యవసానంగా పోలీసు చర్యలు లాంటివేమీ ఉండవు. నెమ్మదిగా విపక్షాలు నెమ్మదిస్తాయి. ప్రజలు కూడా దీనిని మర్చిపోతారు. అంతే! ఈ వ్యవహారానికి తాజాగా ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చాలా సక్సెస్ ఫుల్ గా ఎండ్ కార్డ్ వేసేశారు. 

నిజానికి ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్ పెట్టి.. గోరంట్ల మాధవ్ కు కొంత ఊరట కలిగించినప్పటికీ.. కొన్ని విషయాలు సందిగ్ధంగానే మిగిలిపోయాయి. అసలు వీడియో దొరికేదాకా ఏం చెప్పలేం అని.. విదేశాలలో ఉన్న ఒకరు దానిని తొలుత సర్కులేట్ చేశారని, ఆయన ద్వారా వీడియో రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అర్థం వచ్చేలా ఎస్పీ ఫకీరప్ప మాట్లాడారు. 

దీంతో.. రేపో ఎల్లుండో మీడియా మళ్లీ ఆ ప్రయత్నం ఏమైంది అని ఎస్పీని అడగవచ్చు. దానిని తొలుత సర్కులేషన్ లో పెట్టిన సదరు వ్యక్తిని పట్టుకోవడంలో పోలీసు వ్యవస్థ ఫెయిలైందని అడగవచ్చు… అలాంటి అప్డేట్స్ కు ఆస్కారం ఉండేది. అయితే.. తాజాగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్.. ఆ వీడియో ఇద్దరి మధ్య ఫోన్ కాల్ కు సంబంధించినదని మాధవ్ మొబైల్ లేదా, అవతలి మహిళ మొబైల్ లో రికార్డు అయి ఉండే చాన్సుందని.. ఏదో ఒక మొబైల్ నుంచి వీడియో దొరికే దాకా ఏమీ చెప్పలేమని తెగేసి చెప్పారు. 

ఆ రెండూ జరిగే పని కాదు. అప్పటికీ మీడియా అత్యుత్సాహంతో మాధవ్ మొబైల్ స్వాధీనం చేసుకుని చూడవచ్చు కదా అని కూడా అడిగింది. అది తమ పని కాదని, ఆ సూచన అనంతపురం ఎస్పీకి తెలియజేస్తానని సునీల్ కుమార్ చెప్పేశారు. 

మాధవ్ ఆ వీడియోను మార్ఫింగ్ చేసినట్టుగా చెబుతున్నాడు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాబట్టి.. దానిని ప్రచారంలోకి తెచ్చిన వారి మీద కేసు ఉంది. దొరికితే వారి ఫోనును సీజ్ చేసి.. లోతుగా పరిశోధిస్తారు. 

అంతే తప్ప, మార్ఫింగ్ అని క్లెయిమ్ చేస్తున్న వీడియో, అసలైనదో కాదో తేల్చడానికి ఆ వ్యక్తి ఫోనునే సీజ్ చేయాలని అడగడం కామెడీగా ఉంటుంది. ఇకపోతే, ‘అవతలి మహిళ’ ఎవరో ఇప్పటిదాకా తెలియలేదు. ఆమెను కనిపెట్టడం ఆమె ఫోనును సీజ్ చేయడం, మూలాలను పరిశోధించడం ఇవన్నీ అసాధ్యం. పైగా ఆ ఫోను ఇప్పటిదాకా ఆమె వద్ద ఉంటుందనేది కూడా భ్రమ. డైరక్టుగా ఈ ఇద్దరిలో ఒకకరి ఫోను నుంచి వీడియో ను కాపీ చేసుకుంటే తప్ప.. పోలీసులు పరిశోధన అనే దిశగా అడుగు వేయరు. అది జరిగే పని కానే కాదు. 

ఆ రకంగా చాలా సక్సెస్ ఫుల్ గా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడిపోయింది. ఇక విపక్షాల సమరయోధులందరూ తాము గోల చేయడానికి ఇతర అంశాలను ఎంచుకుంటే మంచిది.