నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమావేశాల్లో అప్పటికప్పుడు టికెట్ ఖరారు చేస్తున్న చంద్రబాబు, ఆళ్లగడ్డ విషయానికి వచ్చే సరికి ఆచితూచి అడుగేస్తున్నారు. చంద్రబాబు నాన్చివేత ధోరణి అఖిలప్రియకు కోపం తెప్పిస్తోంది. తన టికెట్ విషయమై ప్రచారంలో ఉన్నదే నిజమవుతుందేమో అన్న అనుమానం అఖిలప్రియలో బలపడుతోంది. మరోవైపు భర్త భార్గవ్‌రామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు చంద్రబాబు టికెట్ ఇవ్వరని గట్టిగా చెబుతున్నారని తెలిసింది.
టీడీపీ ముఖ్య నేతలకు టికెట్‌పై భరోసా ఇస్తున్న, మరికొందరికి మాత్రం ఏ మాట చెప్పడం లేదు. దీంతో ఆశావహుల్లో ఆందోళన నెలకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో టీడీపీ అధినేత చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం సమావేశంలోనే టికెట్‌పై పచ్చ జెండా ఊపారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, పెనమలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు చంద్రబాబు టికెట్లు ఖరారు చేసినట్టు సమాచారం.
అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురం ఇన్చార్జి నారాయణ రెడ్డి, సంతనూతలపాడు ఇన్చార్జి విజయకుమార్‌కు లైన్ క్లియర్ చేసినట్టు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. కానీ రాయలసీమకు వచ్చే సరికి చంద్రబాబు కొందరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరికొందరికి చూద్దాం అంటూ వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్న కొందరు ముఖ్య నేతలపై బాబు సంతృప్తిగా లేరని సమాచారం. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో లైన్ క్లియర్ చేయలేదంటే, వారిపై బాబు మనసులో ఏదో ఉందని అర్థం చేసుకోవాలని అధిష్టానం పరోక్ష సంకేతాలు ఇస్తోంది.
అయితే ఇప్పుడున్న ఇన్‌చార్జ్‌లకు ప్రత్యామ్నాయంగా బలమైన నాయకుల వైపు చంద్రబాబు చూస్తున్నారని సమాచారం. రాయలసీమలోని ఆళ్లగడ్డ, పుంగనూరు, రాజంపేట, మైదుకూరు, నందికొట్కూరు నియోజకవర్గాలతో పాటు మరికొందరు ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు గురువారం భేటీ అయ్యారు. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, రాజంపేటలో బత్యాల, పుంగనూరులో చల్లా రామచంద్రారెడ్డిలకు దాదాపు లైన్ క్లియర్ చేసినట్టు సమాచారం. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వీళ్లకంటే బలమైన నేతలెవరూ లేరు. కానీ ఆళ్లగడ్డ విషయానికి వచ్చే సరికి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
దీంతో భూమా అఖిలప్రియ అసహనంగా ఉన్నారని సమాచారం. నీరు-చెట్టు బిల్లులకు సంబంధించి వసూళ్లపై టీడీపీ కార్యకర్తలు అధినేత చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఫిర్యాదు నేపథ్యంలో ఆమెను మందలించినట్టు తెలిసింది. అలాగే ఇటీవల ఓ వ్యక్తిని చితకబాది రూ.1.35 కోట్లు లాక్కోవడంపై కూడా చంద్రబాబు చీవాట్లు పెట్టినట్టు సమాచారం. ఇలాంటి పనులతో పార్టీకి చెడ్డపేరు రాదా? అని ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ నేపథ్యంలో అఖిలప్రియకు టికెట్ ఖరారు చేయకపోవడం ఆమె అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబు మనసులో మరో ఆలోచన ఏదో ఉందన్న అనుమానం అఖిలప్రియ, ఆమె అనుచరులను వెంటాడుతోంది.