నియంతృత్వ పోకడలకు పార్టీలో ట్రయల్ రన్!

అవినీతి లేదని, తనకు దేశ ప్రయోజనాలు తప్ప మరొకటి పట్టవని చెప్పగల పాజిటివ్ ముసుగులను మోడీ తొడుక్కుని ఉండవచ్చు గాక.. కానీ.. ఆ ముసుగుల కింద ఆయన అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలు రోజురోజుకూ విజృంభిస్తున్నాయా?…

అవినీతి లేదని, తనకు దేశ ప్రయోజనాలు తప్ప మరొకటి పట్టవని చెప్పగల పాజిటివ్ ముసుగులను మోడీ తొడుక్కుని ఉండవచ్చు గాక.. కానీ.. ఆ ముసుగుల కింద ఆయన అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలు రోజురోజుకూ విజృంభిస్తున్నాయా? అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. తన నియంతృత్వాన్ని స్థిరపరచుకునే దిశగా ప్రధాని నరేంద్రమోడీ రోజురోజుకూ ఓ అడుగు ముందుకే వేస్తున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. 

మోడీ తన నియంతృత్వ పోకడలు ఎంత మేర సక్సెస్‌ఫుల్ గా నడుస్తున్నాయో చెక్ చేసుకోవడానికి ముందు వాటిని తన సొంత పార్టీ మీద ట్రయల్ రన్ గా ప్రయోగిస్తున్నారనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. బిజెపి పార్లమెంటరీ పార్టీ నుంచి నితిన్ గడ్కరీ ని తొలగించడం, మోడీకి విధేయులుగా ఉండగల మరో ఇద్దరిని చేర్చుకోవడం నేపథ్యంలో.. పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా గమనార్హం.

భాజపాలో విధానపరంగా పార్టీ కమిటీలకు కూడా ఎన్నికలు జరగాలని, పార్టీ మౌలిక సిద్ధాంతాల్లో ఇదే ఉన్నదని, అయితే ఇప్పుడు అదేమీ లేకుండా.. సంస్థాగత ఎన్నికలను దూరం పెట్టి, ప్రతి పోస్టుకు మోడీ ఆమోదించిన వ్యక్తినే నియమిస్తున్నారని సుబ్రమణ్యస్వామి విమర్శించారు. 

స్వామి విమర్శలకు పార్టీ వర్గాలు కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోవడం విశేషం. ఆయన విమర్శలకు స్పందిస్తూ వారేం అంటున్నారంటే.. పార్టీలో ఏ స్థానాన్ని భర్తీ చేయాలన్నా పార్టీ అధ్యక్షుడే నామినేట్ చేస్తారని వివరణ ఇస్తున్నారు. ఆ తర్వాత జాతీయ కార్యవర్గం దానిని ఆమోదిస్తుందంటున్నారు. జరుగుతున్నది ఇదే కావొచ్చు. కానీ నియామకపత్రంపై సంతకం మాత్రమే పార్టీ అధ్యక్షుడిది ఉంటుంది.. దాని వెనుక అసలైన నిర్ణయాధికారం మొత్తం మోడీ ఒక్కరిదే అనేదే సుబ్రమణ్యస్వామి ఆరోపణ కూడా. 

బిజెపి వివరణ ఎలా ఉంటున్నదంటే.. ‘ఈ దేశంలో ప్రతి నిర్ణయమూ రాష్ట్రపతి మాత్రమే తీసుకుంటారు’ అన్నట్టుగా ఉంది. సంతకం రాష్ట్రపతిది అయినంత మాత్రాన.. నిర్ణయాధికారం వారిది కాదు కదా! పార్టీ కూడా అలాగే నడుస్తోందనేది సుబ్రహణ్యస్వామి భావం. 

బిజెపి పార్లమెంటరీ పార్టీనుంచి గడ్కరీని బయటకు పంపడం ఈ నియంతృత్వానికి సంకేతమే అని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్రప్రభుత్వంలో ఆరెస్సెస్ ప్రాబల్యానికి ప్రతీకలుగా ఉండే కొందరు నాయకుల్లో నితిన్ గడ్కరీ కూడా ఒకరు. మంచి నాయకుడిగా దార్శనికుడిగా ఆయనకు పేరుంది. అయితే మోడీకి ‘జీహుజూర్’ అనే బ్యాచ్ నాయకుడు కాదనే ముద్ర కూడా ఉంది. ఒక దశలో మోడీ ప్రధానిగా ఉండరాదనే కూటమి పార్టీల వాదన శృతిమించినప్పుడు.. మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీని ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ భావిస్తున్నదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనను పార్లమెంటరీ పార్టీనుంచే బయటకు పంపారు. 

పార్టీ కీలకస్థానాలను మొత్తం ‘ఎస్ బాస్’ నాయకులతోనే నింపుతున్నారు. ఇది పార్టీ మీద మోడీ నియంతృత్వానికి దారి తీస్తుంది. తర్వాతి దశలో దేశంలో నియంతృత్వ పోకడలు నిండిన పరిపాలనకు ఇది కారణమవుతుంది.