భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని మతం పునాదుల మీద ముక్కలుగా చీల్చేయడానికి శక్తివంచన లేకుండా కుట్ర చేస్తున్నదనే ప్రచారం ఒకవైపు చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది. చాలా సహజంగానే కాషాయ దళం ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఉంటుంది. కానీ, వాస్తవంలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
తాజా పరిణామాలను పరిశీలిస్తే.. ఏ మూడ్ లో ఉన్నారో ఏమో గాని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ముసుగులు తీసేసి మనసులోని మాట బయటపెట్టారు. భారతీయ జనతా పార్టీ చాలా నికార్సుగా మత రాజకీయాలు చేస్తూ ఉన్నదని తన మాటల ద్వారా నిరూపించారు! పాదయాత్రలో భాగంగా, కేసీఆర్ ప్రభుత్వం మీద ఎడాపెడా రెచ్చిపోతూ ఉండే, బండి సంజయ్ హిందూ మతం మొత్తం తమ పార్టీకి ఓటు బ్యాంకు గా తయారు కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు!!
తన పాదయాత్రను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బండి సంజయ్ చెప్పుకుంటున్నారు. తమ పార్టీ హిందూ ధర్మం కోసం పనిచేస్తుందని, పేదల కోసం అవసరమైతే గుండా గిరి చేస్తామని ఆయన అంటున్నారు. ఇలాంటి మాటల ద్వారా కాషాయ మూకలు గుండా గిరీకి పాల్పడితే ఆ పనులకు ‘పేదల ప్రయోజనాలు’ అనే ముసుగు తొడిగేలా ముందే ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారన్నమాట!
ఈ క్రమంలోనే ఆయన అధికార తెరాసను హెచ్చరిస్తూ, ఎర్రవాళ్లను, పచ్చ వాళ్లను ఎవరిని తెచ్చుకున్నా తాము భయపడేది లేదని అంటున్నారు. ఎర్రవాళ్ళు అంటే కమ్యూనిస్టులు- పచ్చవాళ్లు అంటే ముస్లింలు అనే ఆయన ఉద్దేశం స్పష్టంగానే అర్థమవుతోంది! తెలంగాణ రాజకీయాలలో మజ్లిస్ తో తెరాసకు ముందు నుంచి స్నేహం ఉండగా, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇప్పుడు వారికే మద్దతు ఇచ్చే వాతావరణం కనిపిస్తోంది.
వారందరిపై కలిపి నిప్పులు చెరిగే ప్రయత్నంలో భాగంగా.. బండి సంజయ్ తన మనసులోని అసలు మాటను కూడా బయటపెట్టారు. దేశంలో 80 శాతంగా ఉన్న హిందువులందరూ కూడా.. ఓటు బ్యాంకుగా మారితేనే దేశాన్ని కాపాడుకోగలమని సంజయ్ అంటున్నారు. మతం ప్రాతిపదికమీద దేశాన్ని రెండుగా చీల్చేయడానికని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.
ఇది బండి సంజయ్ నోటి దూకుడా? లేదా, బిజెపి జాతీయ విధానమా? అనేది తేలాల్సి ఉంది. ఈ దేశంలో బిజెపి అంటే ఇష్టం లేని వాళ్లు, పార్టీ సిద్ధాంతాల మీద సానుకూల దృక్పథం ఉన్నప్పటికీ ఇప్పుడు అనుసరిస్తున్న అతివావ హిందూ పోకడల మీద ఏవగింపు ఉన్న వాళ్లు తాము ‘హిందువులు’ అని చెప్పుకోవడానికి కూడా సంకోచించే పరిస్థితిని కల్పిస్తున్నారు బండి సంజయ్. వారికి ఈ మతవాద పిచ్చి ముదిరిందంటే.. ముందు ముందు.. బిజెపికి ఓటు వేయని వారంతా.. హిందూత్వంలో ఉండొద్దు.. ఇతర మతాల్లోకి వెళ్లిపొండి అని యాగీ చేసినా చేస్తారు.