ఆ తండ్రి కొడుకుగా జగన్ ఒకటికి నాలుగు అడుగులు ముందుకు వేస్తాను అన్నారు. అది ఆచరణలో నిరూపించుకుంటున్నారు కూడా. ధార్మిక పరిషత్ అన్న దాన్ని ఏపీలో తొలిసారి ఏర్పాటు చేసిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది. ఆయన మరణించాక మళ్ళీ ఆ ఊసు ఎక్కడా లేదు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన ధార్మిక పరిషత్ ని ప్రకటించాక ఇపుడు మరో మారు అది వెలుగు చూస్తోంది.
ధార్మిక పరిషత్ దేవాదాయ శాఖకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా శిరోధార్యమని వైసీపీ సర్కార్ ప్రకటించింది. ధార్మిక విషయాలలో నిష్ణాతులు అయిన 21 మందిని నియమించి ఏపీలో దేవాదాయ శాఖకు కొత్త కళ తెచ్చింది. దీని మీద విశాఖలోని శ్రీ శారదాపీఠం అధిపతి స్వరూపాననందేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ధార్మిక పాలక సాగుతోందని శ్లాఘించారు.
తన వద్దకు ప్రభుత్వ పెద్దలు వచ్చి ధార్మిక పరిషత్ విషయంలో సలహా సూచనలు తీసుకున్నారని, దాని ప్రకారం నిపుణులను నియమించారని ఆయన కొనియాడారు.
నాడు వైఎస్సార్ కూడా ధార్మిక పరిషత్ ద్వారా దేవాదాయ వ్యవహారాలను చక్కదిద్దారని, ఇపుడు జగన్ అదే బాటలో నడవడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు. స్వామీజీ వైసీపీ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా దీవించారు కూడా.