ఏ పార్టీ రాజకీయ నాయకులకైనా ఎప్పుడూ మనసు శాంతిగా ఉండదు. ఏదో అసంతృప్తి వారిని వెంటాడుతుంటుంది. ఏ మనిషైనా గుర్తింపు కోరుకోవడం సహజం. ఈ కోరిక రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంటుంది. మరి వారికి గుర్తింపు ఎలా వస్తుంది? పదవి ఉంటే వస్తుంది. బాధ్యతలు అప్పగిస్తే వస్తుంది. అవి లేనివారు అసంతృప్తిగా ఉంటారు.
తెలంగాణా బీజేపీ నాయకురాలు విజయశాంతి అలియాస్ రాములమ్మ పరిస్థితి అదే. పార్టీలో తనకు గుర్తింపు లేదని బాధపడుతోంది. ఆ విషయం ఆమె బహిరంగంగానే చెప్పింది. ఆమె ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉంది. దాంతో ఆమె ఏమీ సాధించలేదు. తన సామర్ధ్యాన్ని నిరూపించుకోలేదు. అది అలంకారప్రాయమైన పదవి మాత్రమే.
బీజేపీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అంతకు మించి చేసేది కూడా ఏమీ లేదు. అందులోనూ ఆమె బీజేపీలో చేరి (రెండోసారి) ఇంకా రెండేళ్లు పూర్తి కాలేదు. విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా తనకు తాను గొప్ప నాయకురాలిగా భావిస్తూ ఉంటుంది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అసంతృప్తిగానే ఉంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందని ఆరోపించింది. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియా ప్రతినిధులతో అన్నది. ''నేను అసంతృప్తిగా ఉన్నానో లేదో పార్టీ నేతల వద్ద స్పష్టత తీసుకోండి. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడదామనుకున్నా. లక్ష్మణ్ వచ్చి మాట్లాడారు.. వెళ్లిపోయారు.. నాకేమీ అర్థం కాలేదు. నా సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాలి. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం?
నా పాత్ర ఎప్పుడూ టాప్ పాత్రే. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మ పాత్రే. ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నాను. పార్లమెంట్లో కొట్లాడిన మనిషిని. నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుంది'' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తే పార్టీ నాయకత్వం మీద చాలా కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీలో ఆమె ఏం కావాలని కోరుకుంటున్నదో. రాజకీయ నాయకులకు ఓపిక బాగా అవసరం. ఓపిగా ఉన్నవారికి నాయకత్వం ఎప్పుడో ఒకప్పుడు పదవి ఇస్తుంది. విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చింది.
ఆమె మొదట భారతీయ జనతా పార్టీ లో చేరింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసింది. ఆమె అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి లో విలీనం చేసి టీఆర్ఎస్ లో చేరింది. 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.
విజయశాంతి ని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాల కారణంతో టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె 2020 డిసెంబరులో భారతీయ జనతా పార్టీ లో చేరింది. బీజేపీలో ఆమె అసంతృప్తి ఏ మేరకు వెళుతుందో చూడాలి.