‘‘కాళీమాతకు నైవేద్యం’’ ఆర్టికల్ కింద వ్యాఖ్యాలు రాసినవారు మణిమేఖలై తీసిన సినిమా పోస్టరు గురించి ఎక్కువ వాపోయారు. దానితో పాటు మరి కొన్ని కామెంట్స్ చేశారు. వాటికి సమాధానంగానే యీ వ్యాసం. మొదటగా చెప్పవలసినది నేను హిందూమతం గురించి ఏం రాసినా, తక్కిన మతాల గురించి రాయగలవా? అంటూ ఛాలెంజ్ చేస్తూంటారు. వీరెవరూ నా పాత ఆర్టికల్స్ చదవలేదనుకుంటాను. నేను బైబిల్‌ను తెలుగులో నా వ్యాఖ్యలతో రాశాను. చర్చిలో సెక్స్ స్కాండల్స్ వార్తల్లో వచ్చినపుడు వాటిపై రాస్తూ వచ్చాను. పాలస్తీనా గురించి, ఐసిస్ గురించి, కేరళలో ఐసిస్ వ్యాప్తి గురించి రాశాను. కార్టూనిస్టులపై ముస్లిము ఛాందసులు చేసిన దాడి గురించి రాసినట్లు గుర్తు. ఎవరూ నా తలకాయ నరకలేదు. నరుకుతాననీ అనలేదు.
ఏ సబ్జక్ట్ రాయాలన్నా మొదటగా దానికి న్యూస్ వర్దీనెస్ ఉండాలి. వ్యాఖ్యానించడానికి ఉండాలి. ఉత్తినే వార్తల్లా రాస్తే ఎవరూ చదవరు. బైబిల్‌లో ఓల్డ్ టెస్ట్‌మెంట్ రాశాక, న్యూ టెస్ట్‌మెంట్, కురాన్, గ్రీకు పురాణాలు కూడా రాద్దామనుకున్నాను. కానీ పాఠకుల స్పందన పెద్దగా లేకపోవడంతో విరమించుకున్నాను. మన పాఠకహిందువులకు యితర మతాల గురించి పెద్దగా ఆసక్తి లేదు. ఏం చేయను? ఇక పురాణాల గురించి, మతాచారాల గురించి రాయాల్సి వచ్చినపుడు నాకు హిందూమతం గురించి పట్టు ఉంది కాబట్టి దాని గురించే రాస్తాను. తక్కినవాటి గురించి రాయాలంటే అడుగడుగునా అనుమానాలే. విషయం సరి చూసుకుంటూ రాయాలి. చాలా సమయం పడుతుంది. పైగా రెస్పాన్సు అంతంత మాత్రమే.
రష్దీపై దాడి గురించి రాయలేదేం? అంటారు. దాడిని ఖండిస్తున్నాను అని ఒక్క వాక్యం కోసం వ్యాసం రాయాలా? నూపుర్ శర్మ గురించి రాయలేదేం? అంటారు. ఆవిడ ఏమందో నేను వినలేదు. ఇప్పుడు ఎక్కడా కనబడటం లేదు కూడా. ఎలాగో సంపాదించి తెలుసుకున్నా, ఆవిడ మహమ్మద్ ప్రవక్త గురించి అన్నది నిజమో కాదో నేను చెప్పలేను. ప్రవక్త జీవితంపై పుస్తకం కొని చాలా రోజులైంది కానీ యింకా చదవలేదు. వ్యాసాలు రాయడానికై చదవాల్సినవే చాలా ఉన్నాయి. కష్టపడి రాసినా పైన చెప్పినట్లు పాఠకులకు ఆసక్తి ఉంటుందో లేదో తెలియదు. ముస్లిముల గురించి అనేక మంది నీచంగా మాట్లాడుతూనే ఉన్నారు. నూపుర్ మాట్లాడినది దాని కంటె ఎక్కువ డోసు అని రియాక్షన్ బట్టి నాకర్థమైంది.
బిజెపి పార్టీ ఆమెపై చర్య తీసుకుంది. కొన్ని ఇస్లామిక్ దేశాలు తీవ్రమైన అభ్యంతరాలు తెలిపాయి. కోర్టులో కేసు నడుస్తోంది. నూపుర్‌ను సమర్థించిన వారిపై దాడులు జరుగుతున్నాయి. అవన్నీ రాస్తే వార్తలవుతాయి తప్ప నా వ్యాఖ్యానమంటూ ఏమీ ఉండదు. అందువలన రాయటం లేదు తప్ప భయమూ, బెరుకూ ఏమీ లేదు. ఏదైనా విమర్శ చేస్తే హిందువులు మాత్రమే చేతకానివాళ్లలా భరిస్తారు తప్ప అన్యమతస్తులు సహించరు అని చాలామంది రాస్తారు. క్రైస్తవం చరిత్ర చదివితే వ్యవస్థపై ఎన్నిసార్లు తిరుగుబాటు జరుగుతూ వచ్చిందో తెలుస్తుంది. సంస్కరణలు కోరుతూ అనేక పంథాల క్రైస్తవ చర్చిలు పుట్టుకుని వచ్చాయి. అవి వందల సంఖ్యలో ఉన్నట్టున్నాయి. ఇస్లాంలో కూడా సంస్కరణవాదులు అనేకమంది పుట్టుకుని వచ్చి, అనేక మార్గాలుగా చీలిపోయింది. అవన్నీ మనకు తెలియక వాళ్లందరినీ ఒకే మూసలో పోస్తాం.
క్రీస్తు జీవితాన్ని వేరే కోణంలో చూపిస్తూ అనేక నవలలు, సినిమాలు వచ్చాయని నాకు తెలుసు. పోనీ యితర మతస్తులందరూ ఛాందసులనీ, వాళ్లకు పరమత సహనం లేదనే అనుకుందాం. అంతమాత్రాన మనం అలా మారవలసిన అవసరం లేదే! అన్ని రకాల వాదాలను యిముడ్చుకోగల నా హిందూమతం గురించి నాకేమీ కించ లేదు. ఇముడ్చుకోలేని పరమతాలలోని ఛాందసులు నాకు ఆదర్శమూర్తులు కారు. వారిని అనుకరిద్దామని చూసే ఇతర హిందువులను చూసి జాలి పడతాను. హిందూమతానికి ఒక ప్రవక్త లేడు. టెన్ కమాండ్‌మెంట్స్‌లా మన దేవుడు ఆదేశాలు శిలాక్షరాలుగా రాసి పంపలేదు.
ఎప్పటికప్పుడు చర్చిస్తూ, సంస్కరిస్తూ వస్తున్న మతం మనది. వేదవిరుద్ధంగా ఉన్న వాదాలు కూడా మతంలో భాగమే. సృష్టిక్రమం గురించి కణాదుడు, కపిలుడు వేదాలతో విభేదించారు. వారూ పూజనీయులే. ప్రశ్న అనేది మనకు మూలం. ప్రశ్నలోంచే ఉపనిషత్తులు పుట్టాయి, అద్వైతం పుట్టింది. శిష్యుడు సందేహం వెలిబుచ్చడం, గురువు తీర్చడం, దానిపై శిష్యుడు మరో ప్రశ్న సంధించడం… యిలా సాగాయి అనేక పుస్తకాలు. ప్రతి మతాచార్యుడు పూర్వమతాచార్యులను వాదనాపటిమతో నెగ్గాడు, బెదిరింపులతో కాదు. వారిని చూసి నేర్చుకోవాలి. ‘ప్రశ్నలు వేయకూడదు, చర్చించకూడదు, నేను చెప్పినది గుడ్డిగా నమ్మాలి’ అంటే వాళ్లు హిందువులే కాదు. మనం మధ్యయుగాల్లో ఆగిపోలేదు. వివేకానందుడు, రాధాకృష్ణన్, ఎకె కుమారస్వామి, జిడ్డు కృష్ణమూర్తి.. వీళ్లందరూ మోడర్న్ హిందూ ఫిలాసఫర్లే. మేధోమథనంతో ఇవాల్వ్ అవుతూ వస్తున్న యీ క్రమాన్ని మొండివైఖరితో ఆపవద్దు.
ఇక మణిమేఖలై సినిమా పోస్టరు గురించి మాట్లాడదాం. దానిలో ఒక వేషగత్తె రోడ్డు మీద నడుస్తూ కాళీ వేషం వేసుకుని సిగరెట్టు కాలుస్తూన్నట్లు కనబడిందంతే. కానీ కొందరు పాఠకులు కాళీ సిగరెట్టు కాల్చినట్లు చూపింది అంటూ అసత్యప్రచారం చేస్తున్నారు. ఆవిడ గుళ్లో కాళీ విగ్రహం సిగరెట్టు కాలుస్తోందని చూపిందా? అసలు అదేమైనా పౌరాణిక చిత్రమా? సినిమాలో దేవుళ్లను కించపరిచే దృశ్యాలుంటే అది వేరే సబ్జక్టు. ఆ పోస్టర్లో మాత్రం అభ్యంతరకరమేమున్నది? దేవుడి పాత్ర వేసినంత మాత్రాన వాళ్లు దేవుళ్లయిపోరు. రాక్షసుడి వేషం వేసినంత మాత్రాన నరమాంస భక్షకులైపోరు. సినిమా షూటింగు సమయాల్లో, నాటకానికి తయారవుతూ దేవుడి వేషం వేసుకుని సిగరెట్టు కాలుస్తున్న దృశ్యాలు ఎన్నో సినిమాల్లో వచ్చాయి. తాజాగా అప్పలరాజు సినిమాలో కూడా అలాటి దృశ్యం ఉన్నట్లు గుర్తు.
మనం పౌరాణిక సినిమాలను ప్రేమించాం. అంతమాత్రాన సోషల్ ఫ్యాంటసీ పేరుతో దేవుళ్లను హాస్యపాత్రలుగా తీర్చిన సినిమాలు ఆదరించలేదా? ఇంద్రుడు, నారదుడు, విష్ణువు, లక్ష్మి.. యిలా ఎందర్నో ఆటపట్టించడం జరిగింది. యుముడైతే మన ఫేవరేట్. ఆయన్ని తన ఎద్దు చేత కుమ్మించాం, ఐస్‌క్రీమ్ తినిపించాం, బ్రోతల్ కేసులో అరెస్టు చేయించాం. కాయస్త కులస్తులకు దేవుడైన చిత్రగుప్తుణ్ని మన తెలుగు సినిమాల్లో బఫూన్ని చేశాం. ఇక ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టాన్ని ఎన్నో సినిమాల్లో ఆట పట్టించారు. ఎన్టీయార్ స్వయానా భక్తులు. పౌరాణిక పాత్రల్లో రాణించారు. అంతమాత్రాన తెరమీద పౌరాణిక పేరడీలు వేయలేదా? ‘‘తిక్క శంకరయ్య’’ సినిమాలో మెంటల్ హాస్పటల్‌లో వేసిన నాటకంలో ఆయన రావణ పాత్రలో పాంటు లాటిది, బూట్లు వేసుకుని వస్తాడు. రేలంగి రాముడు, రాజబాబు సీత. లక్ష్మణుడిగా వేసిన రావి కొండలరావు కాస్సేపటికి సీతా వస్త్రాపహరణ చేయబోతాడు. శివభక్తుడైన రావణున్ని ఎన్టీయార్, సీతామ్మవారిని రాజబాబు అవమానించారని ఎవరూ యాగీ చేయలేదు. ఎన్టీయార్ డైరక్టు చేసిన ‘‘ఉమ్మడి కుటుంబం’’లో కూడా సతీసావిత్రి పారడీ ఉంటుంది. . ఇవన్నీ చూసి ప్రేక్షకులు ఆనందించారు తప్ప ఒరిజినల్ దేవుణ్ని అవమానించారని గోల చేయలేదు. మరి ఇప్పుడెందుకీ అల్లరి?
ఇవన్నీ తెర మీద కనబడినవి. తెరమీదకు, స్టేజి మీదకు వెళ్లబోయే ముందు తయారవుతున్న వాళ్లు ఎలాగైనా ఉండవచ్చు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు వంటి పాత్రల్లో స్టేజి నటులుగా పెద్ద పేరు తెచ్చుకున్న ప్రముఖులెందరో మద్యం సేవించేవారు. దీర్ఘ రాగాలాపన చేయాలంటే అది తప్పనిసరి అని వారి నమ్మకం. ఒక్కోప్పుడు అది మోతాదు మించి యిబ్బందులు తెచ్చిపెట్టేది. ఎవరో చెప్పారు – ఓసారి కృష్ణ పాత్రధారి చిత్తుగా తాగేసి స్టేజి ఎక్కాడట. తూలిపోతున్నాడు. నిలబెట్టడం కష్టమైంది. అందుకని అర్జునుడు బావా అంటూ వాటేసుకుని నిలబెడితే ఆయన పద్యాలు పాడేడు. కాస్సేపు పోయాక దుర్యోధనుడు పాత్రధారి బావా అని కౌగలించుకుని పాడించాడు. అలా ఆయన మత్తు దిగేదాకా వీళ్లిద్దరూ వంతుల వారీగా మోశారట.
పండగ పందిళ్లలో యిలాటి ముచ్చటలు చాలా ఉండేవి. కృష్ణుణ్ని, రాముణ్ని అవమానించారని వీళ్లపై ఎవరూ నిందలు మోపేవారు కాదు. తాగుబోతు అని భయపడి పిలిచేవారు కాదంతే! లేదా మూడు, నాలుగు సీన్లలో నటింపచేసి, దింపేసి, రెండో కృష్ణుడు అంటూ యింకోర్ని తీసుకుని వచ్చేవారు. దేవుడి పాత్ర వేసినంత మాత్రాన వాళ్లు దేవుళ్లయిపోరు. మామూలు మనుషులే. మా చిన్నపుడు పండుగలకి దేవుడి వేషాల్లో కొందరు ఊరేగింపుగా వీధుల్లో తిరిగేవారు. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడి సూచనల మేరకు తాటకిని చంపే దృశ్యం ఒకటి తరచుగా అభినయిస్తూ ఉండేవారు. నాలుగైదు వీధులు తిరిగేసరికి అలిసిపోయి, ఓ అరుగు మీద కూర్చుని బీడీలో, సిగరెట్లో ముట్టించేవారు. ఈ సబ్జక్టుపై మా వరప్రసాద్ (శాంతా బయోటెక్నిక్స్) ‘‘పురవీధుల్లో పురాణపురుషులు’’ అనే పేర చమత్కారభరితమైన వ్యాసం 1974లో రాశాడు. అప్పట్లో మేం ప్రచురించే లిఖిత మాసపత్రిక ‘‘సందీప్త’’లో అది పడింది. అందరూ చదివి నవ్వుకున్నారు కానీ ఆ పాత్రధారులు దేవుళ్లను అవమానించారని ఎవరూ రంకెలు వేయలేదు.
ఎన్టీయార్ గురించి చెప్పేటప్పుడు తప్పనిసరిగా చెప్పే విషయం ఒకటుంది. రాముడు, కృష్ణుడు వంటి పాత్రలు వేసే రోజుల్లో ఆయన శాకాహారం భుజించేవాట్ట. నేల మీద పడుక్కునేవాట్ట. పాత్రలో రాణించాలంటే యిది అవసరమా? రామాయణం పుట్టిన దగ్గర్నుంచి యీపాటికి అనేక కళారూపాల్లో లక్షలాది మంది రాముడి పాత్ర ధరించి వుంటారు. వాళ్లంతా మెప్పించలేదా? ఈయన ఆ వేషం వేసినది అయిదారు సినిమాల్లో! తర్వాతి రోజుల్లో టీవీ రామాయణంలో రాముడు పాత్రధారి ప్రశంసలు అందుకోలేదా? టీవీ భారతంలో కృష్ణుడు ఓహో అనిపించుకోలేదా? అంతెందుకు, తెలుగులో ‘‘సీతారామకళ్యాణం’’లో హరనాథ్ రాముడిగా వెలిగిపోయాడు. ఆయన శాకాహారమే భుజించాడా?
ఒరిజినల్ రాముడే శాకాహారి కాదు. వనవాస సమయంలో నాన్‌వెజ్ తినలేదనుకున్నా (అది కూడా చెక్ చేసుకోవాలి) అంతకు ముందూ వెనుకా తిన్నాడుగా! ‘‘లవకుశ’’ టైముకి రాముడు రాజ్యం చేస్తున్నాడు. నాన్‌వెజ్ తింటూనే ఉండాలి. హంసతూలికా తల్పంపై పడుక్కునే ఉండాలి. మరి పాత్రధారికి శాకాహారభక్షణం, భూశయనం ఎందుకు? ఆ సినిమాలో రాముడిగా ఎన్టీయార్‌కు ఎంత పేరు వచ్చిందో సీతామ్మవారిగా అంజలీదేవికి అంతకంటె పేరు వచ్చింది, ఆవిడ యిలాటివేవీ చేయకపోయినా! పైగా దాని షూటింగు సమయంలోనే ఆవిడ ఒక యిబ్బందికరమైన సంఘటనలో యిరుక్కుందని వినికిడి. ఋషుల వేషాల్లో గుమ్మడి దిట్ట. అతి శాంతమూర్తి వసిష్టుడి పాత్ర నుంచి అతి కోపిష్టి దుర్వాసుడి పాత్ర దాకా వేశారు. ఏ శాకాహార నియమమూ పెట్టుకోపోయినా ఆయన ఋషి వేషాలు అద్భుతంగా రక్తి కట్టించారు. రామారావు గారు నేల మీద పడుక్కున్నారంటే, మాంసం మానేశారంటే ఆయన చాదస్తం ఆయనది అనుకుని ఊరుకోవాలి తప్ప గొప్పగా చెప్పడానికేమీ లేదు.
చెప్పవచ్చేదేమిటంటే పాత్ర వేరు, పాత్రధారి వేరు. కృష్ణుడి పాత్ర వేసే రోజుల్లో పొరుగింట్లో వెన్న దొంగిలించ నవసరం లేదు. రావణుడి పాత్ర వేసే రోజుల్లో పర్వతాలు ఎత్తనూ అక్కరలేదు, పరస్త్రీలను మోహించనూ అక్కరలేదు, దుర్యోధనుడి పాత్ర వేసే రోజుల్లో వస్త్రాపహరణాలు చేయించనక్కరలేదు. రమ్యకృష్ణ వేశ్యగానూ వేసింది, అమ్మవారి గానూ వేశారు. కెఆర్ విజయ స్విమ్‌సూట్‌లోనూ కనబడ్డారు, అమ్మవారిగానూ వేశారు, అలాగే రాశి లాటి అందగత్తెలు గ్లామరు పాత్రలు తగ్గగానే శూలాలు పట్టుకుని దిగిపోయారు. పాత్ర మారినప్పుడల్లా వారి స్వభావం మారుతూ పోలేదు. చార్ల్‌టన్ హెస్టన్ ‘‘టెన్ కమాండ్‌మెంట్స్’’లో మోజెస్, ‘‘విల్ పెన్నీ’’లో కౌబాయ్! రెండు సినిమాల్లోనూ షూటింగు విరామాల్లో ఒక్క లాగానే ప్రవర్తించి ఉంటాడు. ఏ సిగరెట్టు తాగుతూనో ఉండివుంటాడు.
‘‘గాంధీ’’ సినిమా తీసేటప్పుడు బెన్ కింగ్‌స్లీ షూటింగు విరామాల్లో మద్యం సేవించేవాడు. ఓ సారి ఆ ఫోటో వేసి ‘గాంధీ పాత్రధారి మద్యం తాగడమా?’ అంటూ ఓ కొక్కిరాయి వ్యాసం వచ్చింది. అంతా తిట్టిపోశారు. తాగకపోయినంత మాత్రాన నువ్వు ఆయన్ని గాంధీ అనుకుంటావా? వెళ్లి కాళ్లకు మొక్కుతావా? అని. ఈ సినిమాలో ఆయన గాంధీ. మరో దానిలో గోడ్సే వేయవచ్చు. బెన్, గాంధీ పాత్రను తెర మీద కన్విన్సింగ్‌గా ధరించాడా లేదా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసి, గాంధీని మరో తరానికి పరిచయం చేశాడా లేదా అనేదే ముఖ్యం. షూటింగు సమయంలో మద్యం తీసుకున్నంత మాత్రాన గాంధీని అవమానించినట్లు కానే కాదు.
ఎమ్‌ఎఫ్ హుస్సేన్ ప్రస్తావన యీ విషయంలో అనవసరం. అతను సాక్షాత్తూ దేవీమూర్తులను అవమానపరిచాడు. ఆ వేషం వేసుకున్నవాళ్లను కాదు. అతను ఖతార్ పారిపోయినప్పుడు నేను రాసిన ‘ఖతర్(నాక్) హుస్సేన్’ వ్యాసంలో నా అభిప్రాయం స్పష్టంగా రాశాను – సరస్వతిని నగ్నమూర్తిగా చూపడం తప్పు అని. ప్రేమైక మూర్తి ఐన రతీదేవినో, దేవవేశ్యలైన రంభాదులనో అలా చూపినా సర్దుకుపోవచ్చు. కానీ చదువుల తల్లి సరస్వతిని నగ్నంగా ఎందుకు చిత్రీకరించాలి? ఏ పురాణంలోనైనా ఆ ప్రస్తావన ఉందా? నగ్నంగా కూర్చుని వీణ వాయించే ఘట్టం ఉందా? ఈ వ్యాసాన్ని యిక్కడితో ఆపవచ్చు. కానీ కొసరుగా యింకో విషయం! మన దేవతామూర్తులను యితర దేశాలలో అవమానిస్తున్నారు అంటూ అప్పుడప్పుడు నిరసనలు వస్తూంటాయి. దాని గురించి కూడా రాసి ముగిస్తాను.
మనం టూర్లకు వెళ్లినపుడు చైనా, గ్రీకు, బౌద్ధ దేవుళ్ల బొమ్మలు కొంటూ ఉంటాం. వింతగా ఉన్నాయనో, అందంగా ఉన్నాయన కొంటాం తప్ప వాళ్ల పేర్లూ తెలియవు, పూజా విధానమూ తెలియదు. నేనోసారి త్రివేండ్రం వెళ్లినపుడు కథాకళి మాస్క్ కొని యింట్లో గోడకు తగిలించాను. కొన్నాళ్లకు ఓ మలయాళీ ఫ్రెండ్ వచ్చి ‘ఇది విలన్ ఫేస్, ఎందుకు కొన్నావు?’ అన్నాడు. మొహం చుట్టూ గడ్డంలా ఉండేది ఎఱ్ఱగా ఉంటే విలన్‌ట. మనకేం తెలుసు? అదృష్టవశాత్తూ మనం వీటిని పూజా మందిరంలో పెట్టం. కొన్నాళ్లు షోకేస్‌లో పెట్టి, ఆ తర్వాత చోటు చాలకపోతే ఓ గూట్లో పడేస్తాం. దీపధూపనైవేద్యాలుండవు. మనలాగే విదేశీయులకు మన దేవుళ్ల గురించి తెలియదు. ఏ బ్రాందీ బాటిల్ లేబులో డిజైన్ చేయడానికి యింటర్నెట్‌లో యిమేజిలు వెతుకుతూంటే మన గణేశుడు, హనుమాన్ వంటి దేవుళ్లు తోకలు, తొండాలతో కనబడితే వెరైటీగా ఉందనిపించి వాళ్లు వాడేస్తారు. అది మనవాళ్లెవరో గుర్తించి, మీడియాకు తెలియపరుస్తారు.
వెంటనే మన దగ్గర నిరసనలు వెలువడుతాయి, బ్రాందీ బాటిలుకు మన దేవుళ్ల లేబులా? అని. వాళ్లు తెలీక చేశారు, మన దగ్గర గణేశ్ బీడీలు ఎందుకు అమ్ముతున్నారు? గణేశుడు బీడీలు కాలుస్తాడా? కాల్చమంటాడా? బాలాజీ వైన్స్ అనే షాపున్న ఊళ్లు అనేకం. శంకర విలాస్ హోటల్ అంటూ మాంసాహారం అమ్ముతారు. మద్యానికి, వెంకటేశ్వరస్వామికి, శివుడికి, మాంసానికి సంబంధం ఏమిటి? ఇవి అమ్ముకోవడానికి దేవుడి పేరు ఎందుకు వాడుతున్నారు అని మనకు ఎన్నడూ తోచదు. ఆ యా షాపుల ఎదుట ప్రదర్శనలు చేయం. ఎక్కడో ఏ డెన్మార్క్‌లోనో ఆవు మాంసం పాకెట్ మీద నరసింహస్వామి బొమ్మ వేసేడంటే రుంజుకుంటాం. అభ్యంతర పెట్టదలచుకుంటే మన దగ్గర్నుంచే సంస్కరణ మొదలుపెట్టాలి. (ఫోటో – ‘‘తిక్కశంకరయ్య’’లో రావి కొండలరావు, రాజబాబు, ఎన్టీయార్, ఇన్‌సెట్‌లో వివాదాస్పదమైన కాళీ పోస్టర్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)