రేణుకాచౌదరి ఓ ఫైర్‌బ్రాండ్. వయసు పైబడుతున్నా ఆమె కామెంట్స్‌లో వేడి తగ్గలేదు. ఒకప్పుడు నిత్యం వార్తల్లో నిలిచిన మహిళా నాయకురాలు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి, అప్పటి కాంగ్రెస్ యోధులపై తొడలు కొడుతూ అందరి దృష్టి ఆకర్షించిన మహిళా నాయకురాలు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకున్న ముసలంపై ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఎప్పట్లాగే హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి ఓపిక ఉన్న నాయకుడని ఆమె అభిప్రాయపడ్డారు. శశిధర్‌రెడ్డి మనసుకు ఏదో బాధ కలిగి రేవంత్‌పై అలా మాట్లాడి వుంటారని చెప్పుకొచ్చారు. శశిధర్‌రెడ్డి సమస్యలను ఆమె లైట్ తీసుకున్నారు. ఆ సమస్య త్వరగా సమసిపోతుందన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా సూచన చేశారు. లోపం ఏదైనా ఉంటే సరిదిద్దుకోవాలని రేణుకాచౌదరి టీపీసీసీ అధ్యక్షుడికి సూచించడం గమనార్హం. ఇక పార్టీలో తన విషయం గురించి మనసులో మాటను బయట పెట్టారు. పార్టీలో మమ్మల్ని అవమానించే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఒకవేళ అవమానిస్తే దుమారం ఎలా లేపాలో తమకు కూడా తెలుసని హెచ్చరించారు. ఖమ్మంలో తనను ఎదుర్కొనే మొనగాడు లేడని రేణుకాచౌదరి తేల్చి చెప్పారు.
రేణుకాచౌదరి మాటలు అహంకారపూరితంగా వుంటాయని అంటుంటారు. కానీ ఆమె మాట తీరే అలా వుంటుంది. ఎవరినీ లెక్కచేయని స్వభావమే రాజకీయాల్లో ఆమె బలం, బలహీనత కూడా. అందుకే ఆమెతో రాజకీయ గొడవ పెట్టుకోవాలంటే ప్రత్యర్థులెవరైనా ఆచితూచి వ్యవహరిస్తుంటారు.