హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆ వీడియో ఒరిజినల్ అని అమెరికాకు చెందిన ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ నిర్ధారించారని టీడీపీ కొన్ని రోజులుగా చేస్తున్న ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ తాజాగా తేల్చి చెప్పారు.
మాధవ్ వీడియోపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది నకిలీ కాదని నిరూపించేందుకు వీళ్లిద్దరూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చివరికి అమెరికాలోని ప్లోరిడాలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 9వ తేదీన మాధవ్ వీడియోని పంపారు. 11న ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో నగ్న వీడియో అసలైందని తేల్చినట్టు పాత్రికేయుల సమావేశం పెట్టి పట్టాభి, అనిత తేల్చి చెప్పారు.
ఈ నివేదికపై ఇవాళ ఏపీ సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదికను సంబంధిత ల్యాబ్‌కు పంపి నిజమా? కాదా? ఎలా చేశారనే విషయాలపై ఆరా తీశామన్నారు. అయితే సదరు టీడీపీ నేతలు విడుదల చేసిన నివేదిక ఫేక్ అని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫోర్డ్ నుంచి తనకు సమాచారం వచ్చినట్టు సునీల్‌కుమార్ స్పష్టం చేశారు. అసలు ఆ వీడియో కంటెంట్ ఒరిజినలా కాదా అనేది ల్యాబ్ చెప్పలేదన్నారు.
నివేదికను మార్చి ప్రచారం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రైవేట్ ల్యాబ్‌లు ఇచ్చే నివేదికలకు విలువ ఉండదన్నారు. మన ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చే నివేదికే ప్రామాణికం అన్నారు. ఇదిలా వుండగా వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సునీల్ కుమార్ స్పష్టం చేశారు.
ఏకంగా అమెరికన్ ల్యాబ్ నివేదికనే మార్చి ప్రచారం చేయడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ అడ్డంగా బుక్కైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.