పంచుమర్తి అనురాధకు పెద్ద ఆశే. ఆమెతో చర్చకు మంత్రి ఆర్కే రోజా రావాలట. ఎవరి హయాంలో ఎక్కువ పరిశ్రమలు వచ్చాయో ఆధారాలతో చర్చకు రావాలని పంచుమర్తి అనురాధ వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా రావాలని డిమాండ్ చేయడం గమనార్హం. ఇంత కాలం ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలే రాలేదని, జగన్ పుణ్యమా అని ఉన్నవి కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది.
అయితే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశ్రమ ప్రారంభం, అలాగే మరికొన్ని ఏర్పాటుకు శంకుస్థాపనలు చేయడంతో టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. జగన్ ప్రారంభించిన పరిశ్రమను తమ ఖాతాలో వేసుకుంది. దీనికి మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఆర్కే రోజా కూడా తన ప్రభుత్వాన్ని సమర్థించుకుంటూ మాట్లాడారు.
ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడో విజయవాడ కార్పొరేషన్ పదవిలో కొనసాగిన పంచుమర్తి అనురాధ మీడియా అటెన్షన్ కోసం రోజాకు సవాల్ విసరడం గమనార్హం. ఒట్టిమాటలు కాకుండా, ఆధారాలతో బహిరంగ చర్చకు రావాలని రోజాకు ఆమె సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో తెచ్చిన కంపెనీలు జీవోలతో సహా ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీల జీవో కాపీలు, కల్పించిన ఉద్యోగాల వివరాలతో బహిరంగ చర్చకు మంత్రి రోజా రావాలన్నారు.
టీడీపీలో సవాళ్ల విసిరే వాళ్లు పెరిగిపోయారు. ముఖ్యంగా వైసీపీలో రోజా ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడ్డారు. అంతేకాకుండా సినీ గ్లామర్ రోజాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. దీంతో రోజాను టార్గెట్ చేయడం ద్వారా సులువుగా మీడియాలో ప్రచారం వస్తుందనే యావ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.