అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై చేపట్టే మహాపాదయాత్ర-2పై లుకలుకలున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కేవలం కొంత మంది తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకోడానికి మాత్రమే అమరావతి పాదయాత్ర-2 చేయాలనే నిర్ణయానికి వచ్చారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 12న పాదయాత్ర స్టార్ట్ చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఆ రోజుకు అమరావతి పోరాటం 1000వ రోజుకు చేరుతుంది. దీంతో ఆ రోజు మహాపాదయాత్ర చేపట్టాలని రైతు జేఏసీ కమిటీలు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మెజార్టీ జేఏసీలు పాదయాత్రకు సిద్ధంగా లేవని సమాచారం. గత ఏడాది ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో తిరుపతి వరకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత హైకోర్టు వెలువరించిన తీర్పు అమరావతి రైతులకు అనుకూలంగా ఉంది.
అమరావతి నుంచి రాజధాని మార్చే హక్కు ఏపీ అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ తీర్పుపై ఇంత వరకూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లలేదు. కానీ ఫలానా సమయం లోపు రాజధానిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఆదేశాలపై మాత్రం ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. తమకున్న పరిమిత ఆర్థిక వనరుల రీత్యా హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రెండో దఫా మహాపాదయాత్ర చేపట్టాల్సిన అవసం ఏముందని జేఏసీలోనే చర్చకు తెరలేచింది. ఒకవైపు మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, అలాగే హైకోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వస్తోందనే ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతామనే చర్చ జరుగుతోంది. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్య భగవానుడి ఆలయం వరకు పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని మెజార్టీ అమరావతి రైతుల వాదన.
ఇప్పుడు మరోసారి పాదయాత్ర చేపట్టడం అంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడమే అని అమరావతి రైతులే అంటున్న పరిస్థితి. అమరావతి రెండో దఫా పాదయాత్రపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, అది భవిష్యత్‌లో ఏ రూపం తీసుకుంటుందోననే చర్చ పెద్ద ఎత్తున అమరావతిలో జరుగుతోంది.