పూర్తిగా కాషాయ కార్యకర్తగా మారిన పవన్ కల్యాణ్..!

సీమకు న్యాయం చేస్తా, సీమ కోసం పోరాటం చేస్తానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మూసుకున్నారు. చాన్నాళ్ల తర్వాత పరాయి రాష్ట్రం నుంచి, తనకు ఓటు హక్కు ఉన్న సొంత రాష్ట్రానికి వచ్చిన జనసేనాని,…

సీమకు న్యాయం చేస్తా, సీమ కోసం పోరాటం చేస్తానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు నోరు మూసుకున్నారు. చాన్నాళ్ల తర్వాత పరాయి రాష్ట్రం నుంచి, తనకు ఓటు హక్కు ఉన్న సొంత రాష్ట్రానికి వచ్చిన జనసేనాని, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్పందించిన తీరు దారుణంగా ఉంది.

వాస్తవానికి సీమ ఎత్తిపోతలకు తెలంగాణ అడ్డుతగిలినప్పుడే, సీమపై అపార ప్రేమ కురిపించే పవన్ స్పందించాల్సి ఉంది. కనీసం పోతిరెడ్డిపాడుకి నీరు మిగల్చకుండా.. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం నీటిని కిందకు వదిలేస్తున్నప్పుడైనా పవన్ మౌనం వీడాల్సింది. అప్పుడూ నోరు తెరవలేదు.  కనీసం ఇప్పుడు ఏపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు మాట పెగలడంలేదు.

జల వివాదంపై ప్రజలే తేల్చుకోవాలి, నిపుణులతో చర్చించి ఓ అవగాహనకు వస్తానని అనడంలోనే పవన్ కల్యాణ్ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా తెలుస్తుంది. జల వివాదంలో ఎటూ తేల్చుకోలేక తెలంగాణ బీజేపీ నేతలు ఎలా మాట్లాడారో సరిగ్గా పవన్ కల్యాణ్ కూడా అలాగే మాట్లాడుతున్నారు. అక్కడ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి, ఆ రాష్ట్ర బీజేపీ కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుంటోంది, ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఇక్కడ పవన్ కల్యాణ్ కి ఏమైనట్టు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. కనీసం వృథాగా సముద్రం పాలవుతున్న నీటి గురించైనా పవన్ ఎందుకు గట్టిగా తన వాణి వినిపించలేకపోతున్నారు.

రాష్ట్ర విభజన టైమ్ లో నెలల తరబడి ఉపవాసాలు చేశానని చెప్పినవన్నీ వట్టి సినిమా డైలాగులేనా, నిజంగా ఏపీపై, ప్రత్యేకంగా సీమపై పవన్ కి ప్రేమ లేనట్టేనా..? 

రెండు కళ్లు, రెండు కాళ్లు, సిద్ధాంతంతో చంద్రబాబు ఎలాగూ జల వివాదంపై నోరు తెరవడం లేదు. కనీసం జనం కోసం పోరాటం చేస్తానని చెప్పుకునే పవన్ కల్యాణ్ అయినా ఈ వివాదంపై స్పందిస్తారనుకుంటే అదీ కుదరదని తేలిపోయింది.

అజ్ఞాతవాసం వీడి జనాల్లోకి వచ్చిన తర్వాత కూడా పవన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మేననే విషయం స్పష్టమైంది. పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడి, ఆ ప్యాకేజీ కోసమే బీజేపీకి అమ్ముడుపోయారనే విమర్శలను నిజం చేసేలా ఉంది పవన్ ప్రవర్తన.

కనీసం రాయలసీమ నీటి కోసమైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దమ్ము, ధైర్యం పవన్ కి లేకపోవడమే బాధాకరం. రోజు రోజుకీ పూర్తిగా కాషాయ కార్యకర్తగా మారిపోతున్న పవన్, బీజేపీ అజెండాని భుజానికెత్తుకుని, జనసేన పార్టీని నిలువునా పాతాళానికి తొక్కేస్తున్నారు.