తమకు కొరకరాని కొయ్యగా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ పార్లమెంట్ సభ్యులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్ కలిసి మరోసారి కలిసి ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే పలుమార్లు రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు కూడా సమర్పించిన విషయాన్ని స్పీకర్‌కు వారు గుర్తు చేశారు.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనేందుకు రుజువుగా అదనపు సాక్ష్యాధారాలను స్పీకర్‌కు అందజేశారు.
నిన్న లోక్‌సభ స్పీకర్‌ను రఘురామకృష్ణంరాజు కలవడం, నేడు వైసీపీ ఎంపీలు కలిసి ఫిర్యాదు చేయడం ప్రాధాన్యం సంతరిం చుకుంది. లోక్‌సభ స్పీకర్ తీరు వైసీపీని అసహనానికి గురి చేస్తోంది. మరోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా తనకేమీ కాదని రఘురామ ధీమాగా ఉన్నారు.
అంతేకాదు, వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలు, హామీలను నెరవేర్చడంలో అలసత్వం ప్రదర్శిస్తోందని రఘురామకృష్ణంరాజు ప్రతిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖల మీద లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే. రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదులతోనే పుణ్యకాలం కాస్త ముగిసిపోయేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామపై వేటు కోసం వైసీపీ వేటాడుతోందే తప్ప, ఫలితం మాత్రం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతోందని చెప్పొచ్చు.