జీవితంలో ఎన్నో బంధాలు అనుబంధాలు ఉంటాయి. అవి వ్యక్తిగతం, వృత్తిగతంగా ఉంటాయి. ఇక వ్యవహారికంగానూ ఉంటాయి. మనకు ఇష్టమైన రంగంలో కొనసాగాలని ఉంటుంది. కానీ కొన్నిసార్లు దానికి బ్రేకులు పడతాయి.
దాదాపుగా నలభై ఏళ్ళ బంధం అంటే మామూలు విషయం కాదు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పంధాను అనుసరిస్తూ ఎమర్జెన్సీ టైమ్ లో ఎగిసిపడిన యువ కెరటం డాక్టర్ కంభంపాటి హరిబాబు. ఆయన విద్యార్ధి దశ నుంచే యాంటీ కాంగ్రెస్ రాజకీయాన్ని చేస్తూ వచ్చారు. దానికి సరైన రాజకీయ వేదికగా బీజేపీని ఆయన ఎంచుకున్నారు.
ఆ పార్టీలోనే ఉంటూ చట్ట సభలలో అడుగుపెట్టిన హరిబాబు ఏపీ బీజేపీకి సుదీర్ఘకాలం పాటు అధ్యక్షుడిగా సేవలు అందించారు. ఆయన్ని మిజోరాం గవర్నర్ గా కేంద్రం నియమించింది. దాంతో ఆయన పార్టీతో ఉన్న సుదీర్ఘమైన బంధాలను తెంపుకోకతప్పింది కాదు.
ఒక విధమైన ఉద్వేగంతోనే ఆయన పార్టీకి తన రాజీనామా సమర్పించారు. విశాఖ పర్యటనలో ఉన్న సోము వీర్రాజుకు స్వయంగా ఆయన పార్టీ సభ్యత్వం నుంచి తప్పుకుంటూ రాసిన లేఖను అందచేశారు.
ఇక నుంచి హరిబాబు రాజ్యాంగ పదవిలో కొనసాగుతారు. రాజకీయాలకు ఆయన ఇక బహు దూరం. దాంతో ఆయన అనుచరులకు ఒకవైపు ఆనందం, మరో వైపు బాధ కలుగుతోంది. ఏది ఏమైనా హరిబాబు హుందాగానే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారని అంతా శ్లాఘిస్తున్నారు.