అల్లుని చూసి మామ బాలయ్య, తండ్రి చంద్రబాబు సంబరపడ్డ క్షణం. మహానాడుకు వెల్లువెత్తిన జనాన్ని చూసో, లేక తాత ఎన్టీఆర్ స్ఫూర్తో తెలియదు కానీ, నారా లోకేశ్ డైలాగ్‌లు చెబుతున్నారు. లోకేశ్ ప్రయోజకుడవుతున్నాడని చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నాయకులు భలే సంతోషిస్తున్నారు.
మహానాడు వేడుకలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన మార్క్ పంచ్‌లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. ‘జగన్.. ఫ్లూట్ జింక ముందు ఊదు.. మా ముందు కాదు. నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. జగన్‌ను సీఎం సీటు నుంచి దించే వరకు పోరాడతా’ అని శపథం చేయడం గమనార్హం.
బాలయ్య సినిమాలోని డైలాగ్‌ను జగన్‌పై విమర్శలు చేయడానికి లోకేశ్ వాడుకున్నారు. ‘ఫ్లూట్ జింక ముందు ఊదు …సింహం ముందు కాదు’ అని ఓ సినిమాలో బాలయ్య తనదైన స్టైల్‌లో డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేగా గెలవకుండానే మంత్రి అయిన ఘనత లోకేశ్‌ది. ముఖ్యమంత్రి తనయుడిగా, మంత్రిగా మంగళగిరిలో బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ ఓడిపోయారు.
ఇంతకూ జింకెవరు? సింహం ఎవరో అర్థం కావడం లేదు. మొదటి ఎన్నికలోనే ఓడిపోయిన నాయకుడు జింకా లేక సింహం అవుతాడా? అనేది ప్రశ్న. తనకు తాను సింహమనే భావనలో లోకేశ్ ఉన్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి.
ఊరికే పులి, సింహం అని ప్రకటించుకుంటానే సరిపోతుందా? వాటిలా ప్రత్యర్థులను వేటాడితే కదా మనమెవరో జనానికి తెలిసేది. వాస్తవాల కంటే ఊహలు తీయగా వుంటాయని చెబుతారు.
టీడీపీ యువ మహిళా నాయకురాలు నిన్నటి సభలో పులి కడుపున పులే పుడుతుందని, అందుకు లోకేశ్‌ను ఉదహరిస్తూ ఆవేశంతో ఊగిపోతూ చెబితే, అదే నిజమని నమ్మి, ఊహాలోకంలో లోకేశ్ విహరిస్తున్నట్టున్నారు. లేకపోతే జగన్‌ను ఉద్దేశించి ఫ్లూట్ జింక ముందు ఊదు…మా ముందు కాదని చెప్పడం కామెడీ కాదా?