ఆయన ఉత్తరాంధ్రాలో ప్రముఖ బీసీ నాయకుడు. అంతేనా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. తెలుగుదేశం బీసీల పార్టీ అని గట్టిగా చెప్పే నాయకుడు కూడా ఆయనే. ఆయనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన తెలుగుదేశంలో బీసీలకు ఇచ్చే ప్రాముఖ్యత ఎంతో గొప్పది. మాకు అక్కడ ఉన్న గౌరవం స్వేచ్చా వైసీపీలో మంత్రులకు నాయకులకూ ఉన్నాయా అని రీసెంట్ గా మాట్లాడి మాది బీసీల టీడీపీ అని సెలవిచ్చారు.
సీన్ కట్ చేస్తే ఒంగోలులో ఆర్భాటంగా జరుగుతున్న టీడీపీ మహానాడు ఫ్లెక్సీలలో మాత్రం ఎక్కడా ఈ బీసీ నేత ఫోటోలు లేకుండా పోయాయి. అంతే కాదు మహానాడు వేదిక మీద కూడా ఎన్టీయార్ చంద్రబాబు, లోకేష్ త్రిమూర్తులుగా ఉన్న బొమ్మ అతి పెద్దది పెట్టారు. ఆ ప్లేస్ లో నిజానికి మూడవ బొమ్మగా ఉండాల్సింది అచ్చెన్నదే అని అంతా అంటున్నారు.
ఇక ఫ్లెక్సీలలో ఎక్కడ చూసినా లోకేష్, చంద్రబాబు తప్ప అచ్చెన్నది లేదని కూడా అంటున్నారు. దీని మీద వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున అయితే అచ్చెన్నా మా మీద కామెంట్స్ చేయడం కాదు, ముందు టీడీపీ ఫ్లెక్సీలలో నీ ఫోటో ఎక్కడ ఉందో చూసుకో అని గట్టిగానే సలహా ఇచ్చారు.
మహానాడుకు పెద్దగా జనమే లేరు అని కూడా అంటూ సైకిల్ గాలి తీసేసారు. విశాఖలోని లంకెలపాలెంలో సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్రకు వచ్చిన జనం కంటే మహనాడు జనం తక్కువే అని కూడా మంత్రి గారు తేల్చేశారు.
అచ్చెన్న మహానాడులో ముందు వరసలో కూర్చున్నారు. ప్రారంభ ఉపన్యాసం చేశారు, వైసీపీని బాగానే తిట్టారు, కానీ తండ్రీ కొడుకుల పార్టీగా మారిన టీడీపీలో బీసీ నేత, ఏపీ ప్రెసిడెంట్ ఫోటోలు ఎక్కడ అని స్వజనులతో పాటు వైసీపీ లాంటి పార్టీలు అడుగుతున్నాయి.
మరి అచ్చెన్న మా బీసీ పార్టీలో పెదబాబు, చినబాబు కంటే పెద్ద బీసీలు ఎవరూ అని మరో స్టేట్మెంట్ ఇస్తారా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.