తెలుగు ప్రజల నీటి సమస్యకు వైయస్ జలయజ్ఞమే పరిష్కారం

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం అనేమాట నిత్యం ఇంటూ ఉంటాము. రాజకీయాలలో మరీ ఎక్కువ. చరిత్రలో చిరస్థాయిగా నిలవడం భావితరాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే సాధ్యం. నీటి సమస్య పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన…

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం అనేమాట నిత్యం ఇంటూ ఉంటాము. రాజకీయాలలో మరీ ఎక్కువ. చరిత్రలో చిరస్థాయిగా నిలవడం భావితరాలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే సాధ్యం. నీటి సమస్య పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన జలయజ్ఞం చరిత్రలో వై యస్ రాజశేఖర్ రెడ్డిని చిరస్థాయిగా నిలిచిపోయెలా చేసింది.

తెలంగాణ , ఏపీ ప్రభుత్వాల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో వైయస్ జలయజ్ఞంకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రాయలసీమ ప్రజలలో నిర్వేదంతో  వినిపించే మాట మరికొంత కాలం ఆంగ్లేయులు ఉండి ఉంటే ? రాయలసీమకు నీటి కష్టాలు ఉండేవా !

స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తి అయినా సీమలో ఆంగ్లేయులు నిర్మించిన కేసి కెనాల్ మినహా ఒక లక్ష‌ ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టును మన పాలకులు నిర్మించలేదు. అంతేకాదు నాడు సీమలో నెలకొన్న కరువు పరిస్థితులును చూసీ చలించి శాశ్వత ప్రాతిపదికన సీమ నీటి సమస్య పరిష్కారానికి కృష్ణా పెన్నారు ప్రాజెక్టును రూపొందించినారు.

నేటికీ రాయలసీమలో సిద్దేశ్వరం కావాలనే నినాదం వినిపిస్తోంది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టాలి అన్న నినాదం మొదటి వినిపించిన రాయలసీమలో నిర్వేదంతో అనే మాట వారు మరికొంత కాలం ఉండి ఉంటే కృష్ణా పెన్నారు నిర్మాణం జరిగి ఉండేది. రాయలసీమకు నేటి కరువు ఉండేది కాదు కదా అని. ప్రజల బాగు కోసం కీలక నిర్ణయాలు తీసుకునే వారికి చరిత్రలో లభించే స్థానం అది.

 రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం ఆంగ్లేయుల తర్వాత మనసు పెట్టిన వారు రామారావు గారు అయితే ఆంగ్లేయుల ఊహకు కార్యరూపం ఇచ్చింది మాత్రం నిస్సందేహంగా వైయస్ అని చెప్పక తప్పదు. మొదట రూపొందించిన కృష్ణా పెన్నారు స్థానంలో నాగార్జున సాగర్ నిర్మాణం కావడం సీమలో నిర్మించిన శ్రీశైలం రాయలసీమకు ఉపయోగపడకపోవడంతో ఏటా 1000 టీఎంసీల నీరు ప్రవహిస్తున్నా వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నా త్రాగడానికి నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి రాయలసీమది.

అలాంటి సమయంలో రూపుదిద్దుకున్నదే మలిదశ రాయలసీమ ఉద్యమం. అందులో పాల్గొన్న కీలక నేతలలో వైయస్ ఒకరు. కేవలం చెన్నై నగరానికి నీటి సరఫరా చేసేందుకు మాత్రమే ఉద్దేశించిన ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా సీమ ఉద్యమం జరిగింది. రాయలసీమకు నీరు ఇవ్వకుండా పోతిరెడ్డిపాడు నుంచి ఎలా నీరు తీసుకుని పోతారో చూస్తామంటూ నడిచిన సీమ ఉద్యమ ఫలితమే నేటి సీమ ప్రాజెక్టుల రూపకల్పన.

అధికారంలోకి వచ్చిన తర్వాత తాను విపక్ష నేతగా ఉన్నప్పుడు సీమ అవసరాలకు ఏ ప్రాజెక్టులను నిర్మించాలని పోరాటం చేశారో వాటిని మొదలు పెట్టారు. గాలేరు నగరి , హంద్రీనీవా , వెలుగొండ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఒక దశకు చేరుకున్నాయి కాబట్టే వాటికి విభజన చట్టంలో చోటు దక్కింది. నేడు అంతో ఇంతో నీరు సీమ ప్రాజెక్టులకు నీరు వస్తుంది అంటే నాడు వైయస్ చేసిన పోతిరెడ్డిపాడు వెడల్పు కారణం.

రాయలసీమ పరిస్థితి ఇలా ఉంటే దక్షిణ తెలంగాణలో పరిస్థితులు కూడా దయనీయంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సమగ్ర జలవిధానాన్ని రూపొందించినారు. కృష్ణా , గోదావరి డెల్టా మరియు ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును  ముందుకు తీసుకొచ్చారు. నాగార్జున సాగర్ , పులిచింతల మధ్య 100 TMC క్యాచ్ మెంట్ ను ఉపయోగించే ఉద్దేశ్యంతో పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. మరో వైపు గోదావరి జలాలను తెలంగాణకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల రూపొందించినారు.
 
ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ , రాయలసీమ కు అన్యాయం జరిగింది. అదే సమయంలో రెండు ప్రాంతాల ప్రయోజనం కోసం రూపొందించిన ప్రాజెక్టులు మిగులు , వరద జలాలపై ఆధారపడి ఉన్నాయి. పోలవరం పూర్తి అయిన తెలంగాణ అవసరాలకు సాగర్ ఎడమ కాలువకు 100 TMC నీరు శ్రీశైలం నుంచి విడుదల చేయాలి. అప్పుడు బ్యాక్ వాటర్ మీద ఆధారపడి ఉన్న రాయలసీమ , దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందదు.

సమృద్ధిగా  ఉన్న గోదావరి నీటిని  దుమ్ము గూడెం నుంచి సాగర్ కు లిఫ్ట్ చేయడం ద్వారా శ్రీశైలం నీటిని సాగర్ జలాశయంకు విడుదల చేయాల్సిన అవసరం ఉండదు.అందుకు అనుగుణంగా దుమ్ముగూడెం – సాగర్ టెల్ పాండు మరియు పులిచింతల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. శ్రీశైలం నీటిని సాగర్ జలాశయంకు విడుదల చేయాల్సిన అవసరం లేకుండా వాటిని పూర్తిగా రాయలసీమ , నెల్లూరు , ప్రకాశంలోని వెలుగొండతొ బాటు వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి నీరు ఇచ్చే ప్రణాళికలు రూపొందించి తన దార్శినికతను చాటుకున్నారు. బహుశా వారు ప్రమాదంలో మరణించకుండా ఉండి ఉంటే వారి కాలంలోనే పై ప్రణాళికలు పూర్తి చేసుకుని రాయలసీమ , దక్షిణ తెలంగాణ నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం జరిగి ఉండేది.

 దక్షిణ తెలంగాణ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన వైయస్ పై నిందలు వేయడం దుర్మార్గం. వారికి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేయాలనే తలంపు ఉంటే. కల్వకుర్తి , నెట్టంపాడు , పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు రూపొందించిఉంటారు. దక్షిణ తెలంగాణ కోసం శ్రీశైలం నీటిని ఉపయోగించే ప్రయత్నం , ప్రాజెక్టుల రూపకల్పన చేసిన వారిపై నిందలు వేస్తున్న ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టుకూడా నిర్మించలేదన్న వాస్తవాన్ని గుర్తించాలి. 

ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య జల వివాదం చెలరేగిన నేపథ్యంలో నాడు అన్ని ప్రాంతాల నీటి సమస్య పరిష్కారానికి రూపొందించిన జలయజ్ఞం పూర్తి చేయడము ద్వారానే సమస్యకు పరిష్కారం  అన్ని ప్రాంతాలకు న్యాయం చేకూరుతుంది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, 9490493436