కరోనా సెకెండ్ వేవ్ ను ఎదుర్కొనడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రధానమంత్రి స్వయంగా ఒప్పుకున్నట్టుగా అయ్యింది. కేంద్ర వైద్య శాఖా మంత్రి, ఆ శాఖ సహాయమంత్రి ఇద్దరినీ తప్పించేశారు! మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైద్య శాఖ మంత్రిగా వ్యవహరించిన హర్షవర్ధన్ ను ఆ హోదా నుంచి తప్పించారు. అలాగే ఆ శాఖకు సహాయ మంత్రిగా వ్యవహరించిన ఎంపీని కూడా ఆ హోదా నుంచి తప్పించి.. వైద్య శాఖ వ్యవహారాల విషయంలో వారు విఫలం అయ్యారనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ప్రత్యేకించి కరోనా సెకెండ్ వేవ్ ను అంచనా వేయడంలో కానీ, ప్రిపేర్ కావడంలో కానీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టుకొచ్చినట్టుగా కనిపించింది. సెకెండ్ వేవ్ ను భారత వైద్య శాఖ కనీసం ప్రిడిక్ట్ చేయలేకపోయింది. అనేక మంది వైద్య పరిశోధకులు, వివిధ అధ్యయన సంస్థలు అలర్ట్ చేసినా కేంద్రం స్పందించింది అంతంత మాత్రమే.
కరోనా వ్యవహారాలను, బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాల్లోకి కలిపేసినా.. తీవ్ర విమర్శలు వచ్చింది మాత్రం కేంద్ర ప్రభుత్వం మీదే. కరోనా కేసులను రాష్ట్రాల వారీగా లెక్కలేస్తూ వచ్చినా.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ముందస్తుగా ఏం చేసింది? అనే చర్చే సర్వత్రా జరిగింది.
ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్వయంగా ప్రధాన మంత్రి మోడీపై జనసామాన్యం అసహనం వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ పై ప్రజల్లో అవగాహన కల్పించి, దాన్ని అందించడంలో కేంద్రం విఫలం అయ్యింది. విదేశాలకు ఎగుమతి చేసిన ఏడెనిమిది కోట్ల వ్యాక్సిన్ లను మొదట్లోనే మహారాష్ట్ర వంటి రాష్ట్రంలో, కరోనా సెకెండ్ వేవ్ విజృంభించిన ముంబై వంటి చోట వేసి ఉంటే.. పరిస్థితి ఇంత తీవ్రంగా మారేది కాదేమో! ఈ విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటి వారు బహిరంగంగానే ప్రస్తావించారు.
కరోనాను ఎదుర్కొనడంలో ఒక ప్లాన్ అంటూ కేంద్రం వద్ద లేకుండా పోయిందని, చివర్లో కేసులు తగ్గినప్పుడు మాత్రం కరోనాపై విజయం సాధించినట్టుగా కేంద్రమంత్రులు ప్రకటించుకోవడం ప్రహసనంగా మారిందని సామాన్యులకు కూడా అర్థం అయ్యింది.
ఇటీవల కూడా కరోనా కేసులు వాటంతట అవి తగ్గుతున్నప్పుడు .. ఇది మోడీ ప్రభుత్వ విజయం అంటూ ప్రకటించి కేంద్రమంత్రులు ప్రహసనం పాలయ్యారు. మరి అంత విజయం సాధించినప్పుడు.. ఆ విజయ సారధులు అయిన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, సహాయ మంత్రులను ఎందుకు తప్పించినట్టో మరి!