ఈ మధ్యకాలంలో కాస్త హడావుడి సృష్టించిన సినిమా నారప్ప. వెంకటేష్ హీరోగా తయారైన ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫారమ్ కు విక్రయించారు. సమర్పకుడు థాను ప్రెషర్ వుందని నిర్మాత సురేష్ బాబు, కాదు ఇదంతా సురేష్ బాబు ఇష్టమే అని మరొకరు ఇలా వార్తలు వినిపించాయి.
డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన సురేష్ బాబు ఇలా చేయడం ఏమిటి అని టాలీవుడ్ విపరీతంగా విమర్శలు, కామెంట్లు వినిపించాయి. మరో పక్కన వెంకీ ఫ్యాన్స్ కూడా దీని మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. అలా చేయవద్దని కోరడమే కాదు, కొందరు నిరాహార దీక్షకు, కొందరు ఇంకా దుందుడుకు పనులకు దిగారు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లకు అనుమతి ఇవ్వడంతోనూ, తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో వుంచుకుని, సినిమాను వెనక్కు తీసుకోవాలని సురేష్ బాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓటిటి ప్లాట్ ఫారమ్ తో సంప్రదింపులు ప్రారంభించారని బోగట్టా.
ఓటిటి ప్లాట్ ఫారమ్ కూడా ఇందుకు సానుకూలంగానే వున్నట్లు తెలుస్తోంది. అయితే సమర్పకుడు థాను ఈ విషయంలో ఇంకా వెనుక ముందు ఆడుతున్నట్లు, ఆయనతో హీరో వెంకటేష్ నే స్వయంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.
అవసరం అయితే రెమ్యూనిరేషన్ ను ప్రస్తుతానికి వెనక్కు పెట్టేందుకు కూడా వెంకీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.