ఇడుపులపాయ….కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్సార్ కుటుంబ అడ్డా. క్రిస్మస్ వస్తే చాలు వైఎస్సార్ ఒక్కరోజు ముందుగానే అక్కడ వాలే వారు. కొండల మధ్య పచ్చదనం పరుచుకున్న వాతావరణంలో, ఆప్యాయతలకు ప్రతీకగా నిర్మించుకున్న గెస్ట్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, బింధుమిత్రులతో కలిసి క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం దివంగత వైఎస్సార్ ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కానీ ఇప్పుడు వైఎస్సార్ భౌతికంగా లేరు. ఆయన సమాధి అక్కడ ఉంది. వైఎస్సార్ లేని ఆయన కుటుంబం పాలిట ఇడుపులపాయ కాస్త ‘విడి’పులపాయగా మారిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత క్రిస్మిస్ నాడు షర్మిల కుటుంబ వేడుకలకు దూరంగా ఉండింది. అప్పట్లోనే అన్నాచెల్లెళ్ల మధ్య ఏదో జరుగుతోందనే వార్తలొచ్చాయి.
వైఎస్సార్ జయంతి వచ్చిందంటే చాలు ఆయన భార్య విజయలక్ష్మి, తనయుడు వైఎస్ జగన్-భారతి, తనయ షర్మిల-అనిల్, వారి పిల్లలు ఇతరత్రా బంధువులతో ఇడుపులపాయ సందడిగా ఉండేది. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో కుటుంబంలో స్పష్టమైన విభజన కనిపిస్తోంది. వైఎస్ షర్మిల తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఈ రోజు (గురువారం) ఉదయం దివంగత నేత వైఎస్సార్‌కు ఇడుపులపాయలో ఘనంగా నివాళులర్పించారు. తాను నేటి సాయంత్రం నూతన పార్టీని స్థాపించనున్న నేపథ్యంలో తండ్రి ఆశీస్సులతో తిరిగి హైదరాబాద్‌కు తల్లితో కలిసి పయనమయ్యారు.
ఆ తర్వాత వైఎస్ జగన్ భార్య భారతి ఇడుపులపాయకు వచ్చి మామకు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో భారతి ఒక్కటే వచ్చారు. జగన్ కాస్త ఆలస్యంగా ఇడుపులపాయకు వచ్చి తండ్రి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. గతంలో షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఎప్పుడొచ్చినా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరత్రా నాయకులు పెద్ద ఎత్తున వెళ్లి కలిసే వాళ్లు. ఇప్పుడా వాతావరణం ఇడుపులపాయలో షర్మిల రాక సందర్భంగా కనిపించకపోవడం గమనార్హం.
ఇడుపులపాయలో షర్మిలను కలవకూడదనే జగన్ తన షెడ్యూల్‌ను మార్చుకున్నారనే సంకేతాలు బలంగా వెళ్లడంతో వైసీపీ నేతలు జాగ్రత్త పడినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. షర్మిలను కలిస్తే తమకెక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోననే భయం వైసీపీ శ్రేణుల్లో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా కలిసి ఉండి, అన్నీ బాగుంటేనే.. షర్మిలమ్మా, విజయమ్మా అనే ఆప్యాయతలు, అనుబంధాలు, అనురాగాలు. రాజకీయంగా దారులు వేరైన నేపథ్యంలో అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధానికి అవరోధాలు ఏర్పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందువల్లే మొదటిసారిగా దివంగత వైఎస్సార్ జయంతి నాడు కుటుంబ సభ్యులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా నివాళులర్పించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వైఎస్సార్ కుటుంబంలో ఈ రకమైన వాతావరణం వైసీపీ శ్రేణుల్లో నిరాశ నింపుతోందని చెప్పక తప్పదు.