తెలంగాణలో వైఎస్సార్ తనయ షర్మిల స్థాపించనున్న వైఎస్సార్‌టీపీతో తమకెలాంటి సంబంధం లేదని జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ జయంతిని పురస్కరించుకుని, ఆయన ఆశీస్సులతో తెలంగాణలో వైఎస్సార్‌టీపీని నేడు షర్మిల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంతో షర్మిల పార్టీపై సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ షర్మిల తన తండ్రి ఆశీర్వచనం తీసుకున్నారన్నారు. పార్టీ పెడతానని షర్మిల గతంలోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో తమ పార్టీని విస్తరించలేదని సజ్జల చెప్పారు. ఇక షర్మిల ప్రారంభించనున్న పార్టీ గురించి తాము మాట్లాడాల్సిన అవసరం లేదని సజ్జల స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యతో షర్మిల రాజకీయ పార్టీతో తమకెలాంటి సంబంధం లేదని చెప్పినట్టైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకోవడం ద్వారా వైఎస్సార్ ఆశయాలను పునశ్చరించుకుని పునరంకితం అవుతామని ఆయన చెప్పుకొచ్చారు.