జనసేనాని పవన్‌కల్యాణ్‌కు పెద్ద అనుమానమే వచ్చింది. దాన్ని తీర్చే వాళ్లు కావాలిప్పుడు. కొన్ని నెలల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ నేలపై అడుగు పెట్టారు. కోవిడ్ కారణంగానే తాను రాలేకపోయినట్టు ఆయన జనసేన శ్రేణులకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకు ముందు ఆయన సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్‌లు లేకపోవడం, కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆయన ఆంధ్రాకు రావడానికి వీలైంది.
ఏపీ సమస్యలపై ఆయన సీరియస్‌గా స్పందించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని అందరూ భావించారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అతిపెద్ద సమస్యగా మారిన జలజగడంపై పవన్‌కల్యాణ్ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనే ఉత్కంఠ సహజంగానే ఉండింది.
తాజాగా జల జగడంపై పవన్‌కల్యాణ్ కామెంట్స్ విన్న తర్వాత ఏపీ ప్రజానీకం నీరుగారిపోయింది. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కొత్త కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జల జగడంపై ఏమన్నారంటే..
‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య ఎంతో సఖ్యత ఉంది కదా… అలాంటిది వారు గొడవ పడటం నమ్మశక్యంగా లేదని కొందరు తెలంగాణ నాయకులు చెప్పారు. మరోవైపు నీటివనరుల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు సాగుతున్నాయి. జలవివాదం అనేది ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న రాజకీయ నాటకమా? లేక నిజంగా సమస్య ఉందా అని ప్రజలు ఆలోచించాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు.
జల వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ నాటకమా? నిజమా? అనేది కూడా తెలుసుకోలేని అమాయకత్వంలో జనసేనాని ఉన్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వేలాది పుస్తకాలు చదివిన జ్ఞానికి ఆ మాత్రం రాజకీయాలు అర్థం కావా? అనేది మరో అనుమానం. ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగత సఖ్యత ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడతారని పవన్ ఎలా అనుకుంటున్నారు? అనే కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇదంతా జలవివాదం నుంచి ఒక రాజకీయ పార్టీగా తప్పించుకోడానికి వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. జలవివాదంపై పవన్ దాతవేత ధోరణి తెలియని అమాయకులు ఏపీ ప్రజలు కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. పవన్‌ది అమాయకత్వమో, అజ్ఞానమో, అతి తెలివో అర్థం కావడం లేదని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.