వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సోదరి, నేడు తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్న షర్మిలకు విభేదాలున్నాయని కొంత కాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమే అనేందుకు నిలువెత్తు “సాక్షి”గా నిలుస్తోంది షర్మిల వదిన వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా నిలిచిన దినపత్రిక.
తన తండ్రి దివంగత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో నేటి సాయంత్రం పెద్ద ఎత్తున వైఎస్సార్టీపీ ఆవిష్కరణ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించి ఎల్లో మీడియాగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రజ్యోతి దినపత్రికకు షర్మిల ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం విశేషం. ఆంధ్రజ్యోతితో పాటు అన్ని మీడియా సంస్థకు ఇలాంటి ప్రకటనలు ఇచ్చి ఉంటే చర్చనీయాంశమయ్యేది కాదు.
షర్మిల పార్టీ ఆవిర్భావ ప్రకటన కేవలం ఆంధ్రజ్యోతికే ఇవ్వడం ఇక్కడ కీలక అంశంగా చెప్పుకోవచ్చు. దివంగత వైఎస్సార్ ఆ రెండు దినపత్రికలంటూ అప్పట్లో విమర్శించిన వాటిలో ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. అప్పట్లో ఎల్లో మీడియా విశ్వసనీయతను దెబ్బతీయడంలో వైఎస్సార్ విజయం సాధించారు.
ఎల్లో మీడియాను వ్యతిరేకించడంలో తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్ కూడా నడిచారు. పైగా జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతికి కనీసం ఒక్క రూపాయి కూడా యాడ్ రూపంలో ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మీడియా గ్రూప్ అధిపతి వేమూరి రాధాకృష్ణ పలు సందర్భాల్లో ప్రస్తావించి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
తండ్రి, అన్న వ్యతిరేకించిన ఆంధ్రజ్యోతి పత్రికకు తనయ షర్మిల పెద్ద మొత్తంలో ఆర్థిక లబ్ధి కలిగించే వాణిజ్య ప్రకటన ఇవ్వడం వైఎస్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోయే విషయాన్ని కూడా మొట్టమొదట ఆంధ్రజ్యోతిలోనే రావడం గమనార్హం. తండ్రి, అన్న వ్యతిరేకించే ఎల్లో మీడియాను కూతురు ఆదరించడంలో లాజిక్ ఏంటబ్బా అనే చర్చ కూడా జరుగుతోంది. పైగా సాక్షిలో తన కవరేజీ రాదు కదా అని ఆ మధ్య నిరశనలో ఉన్న షర్మిల వ్యంగ్యంగా అన్న విషయం తెలిసిందే.
ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో పాటు వైసీపీ శ్రేణులను షాక్‌కు గురి చేసే విషయం మరొకటి ఉంది. తన అన్న వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రారంభమై, ప్రస్తుతం వదిన వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా నడుస్తున్న సాక్షి దినపత్రికకు షర్మిల అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద షాకింగ్ న్యూస్‌గా చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి వైఎస్ జగన్, వదిన భారతిలతో షర్మిలకు విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నట్టు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన పార్టీ ఆవిర్భావ ప్రకటనలో తల్లి వైఎస్ విజయలక్ష్మి ఫొటో లేకపోవడం చర్చకు దారి తీసింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగుతున్నారు. నేడు తల్లి ఆశీస్సులతో షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. షర్మిల వెన్నంటే మాతృమూర్తి విజయమ్మ ఉంటున్నారు. అలాంటిది అమ్మ ఫొటో లేకపోవడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.