థియేటర్ ఆర్డర్..ఓ బ్రహ్మ పదార్థం

నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ ఆదేశం జారీ చేసింది. సినిమా థియేటర్లు ఈ నెల 8 నుంచి తెరవడానికి సంబంధించిన ఆదేశాలు అవి. దీనిని ఓ బ్రహ్మ పదార్ధం అనుకోవాలి. ఎందుకంటే…

నిన్నటికి నిన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓ ఆదేశం జారీ చేసింది. సినిమా థియేటర్లు ఈ నెల 8 నుంచి తెరవడానికి సంబంధించిన ఆదేశాలు అవి. దీనిని ఓ బ్రహ్మ పదార్ధం అనుకోవాలి. ఎందుకంటే ఎవరికి వారు, వారికి తోచినట్లు అన్వయం చేసుకుంటున్నారు. నిజానికి అదేమీ ఇండస్ట్రీ అనుకూలం అయితే కాదు. కానీ అది చూసి ప్రభుత్వం ఫ్లెక్సీరేట్లు ఇచ్చేసిందని భ్రమపడుతున్నారు.

నిజానికి ఇచ్చిన ఆదేశాల్లో కొంత క్లారిటీ మిస్ అయిన మాట వాస్తవం. అయితే ఆ ఆదేశాలను చూస్తే మాత్రం థియేటర్ల కష్టాలు తీరకపోగా, మరింత బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 

విషయం ఏమిటంటే ఏప్రిల్ లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తూ థియేటర్లు తెరవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.అంటే తగ్గించిన రేట్లే అమలు చేయాలన్నమాట. పైగా ఈ తగ్గించిన రేట్లు థియేటర్ లైసెన్స్ కు సంబంధించిన బి ఫారమ్ లో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశాల్లో తెలిపారు. 

అంటే భవిష్యత్ లో దాన్ని ఉల్లంఘిస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం వుంటుంది. ఇక మరో విషయం ఏమిటంటే రేట్ల సవరణ కు సంబంధించి ఉత్తరోత్తరా ఎప్పటికప్పుడు ఆదేశాలు వుంటాయని తెలిపారు. 

అంటే ప్రభుత్వం మనసు మార్చుకుంటే కొత్త ఆదేశాలు ఇస్తుందా? లేక ఎవరైనా సినిమా విడుదల అప్పుడు అడిగితే కొత్త రేట్లు ఇస్తుందా? అన్నది క్లారిటీ లేదు. పైగా అలా ఇచ్చే ఉద్దేశం వుంటే దానికి విధి విధానాలు అనేవి ఏమిటన్నది లేదు.

ఈ క్లాజ్ పెట్టడానికి కారణం భవిష్యత్ లో టికెట్ రేట్ల పెంపు కావాలంటే జాయింట్ కలెక్టర్ ను సంప్రదించకుండా డైరక్ట్ గా ప్రభుత్వం తన దగ్గరే పవర్స్ ను వుంచుకున్నట్లు అనిపిస్తోంది. కోర్టుకు వెళ్తే, ప్రభుత్వం రేట్ల పెంపు ఆప్షన్ ను ఓపెన్ గా వుంది కనుక, ప్రభుత్వం దగ్గరకే వెళ్లమనే అవకాశం వుంది. 

మొత్తం మీద ఏప్రిల్ లో తగ్గించిన రేట్లే థియేటర్లకు ఫిక్స్ చేసింది ఆంధ్ర ప్రభుత్వం. అందువల్ల థియేటర్లు తెరచుకుంటాయా? తెరచుకోవా? అన్నది చూడాలి. 

ప్రభుత్వం కరుణించి, కొద్దిగా రేట్లు సవరిస్తే చాలు థియేటర్లు తెరచుకుంటాయి. కానీ అది సాధ్యమేనా అన్నది అనుమానం., ఇప్పటికే పలువురు ఈ విషయాన్ని సిఎమ్ జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది.