ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో విలన్ ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటివరకు విజయ్ సేతుపతి పేరు గట్టిగా వినిపించినప్పటికీ, ఇప్పుడు ఆ స్థానంలో సౌత్ కు చెందిన మరో సీనియర్ నటుడ్ని తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ సీనియర్ నటుడు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సలార్ లో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని ప్రయత్నించిన మాట వాస్తవం. విజయ్ సేతుపతి కూడా ముందుగా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కాల్షీట్లు కేటాయించలేక తప్పుకున్నాడు. ఇప్పుడా స్థానంలో మరో తమిళ స్టార్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ మేరకు ఆ నటుడికి సలార్ స్క్రిప్ట్ కూడా అందించినట్టు తెలుస్తోంది.
సలార్ సినిమాలో విలన్ పాత్ర, రెగ్యులర్ గా ఉండదు. ఆ క్యారెక్టర్ కు ఓ ఫ్యామిలీ కూడా ఉంటుంది. దానికో నేపథ్యం ఉంటుంది. విలన్ పాత్రధారికి భార్యగా బాలీవుడ్ నుంచి వాణికపూర్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా కొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోంది సలార్. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్తాడు. దాదాపు అదే టైమ్ లో సలార్ షెడ్యూల్ కూడా మొదలుకాబోతోంది. శృతిహాసన్ ఇందులో హీరోయిన్.